ఆఫ్రికా అభివృద్ధికి భారత్‌ బాసట – ప్రధాని నరేంద్ర మోదీ

l2015102972457
న్యూఢిల్లీ,అక్టోబర్‌29(జనంసాక్షి): ఆఫ్రికా దేశాల ఆర్థిక వృద్ధి వేగం పుంజుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. వీటిని ఆదుకునేందుకు భారత్‌ ఎప్పుడూ ముందుంటుందన్నారు. దిల్లీలో జరిగిన భారత్‌-ఆఫ్రికా ఫోరం సదస్సు ముగింపు కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఆఫ్రికా దేశాధినేతలు ఈ సదస్సులో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఇది కేవలం భారత్‌-ఆఫ్రికా సదస్సు కాదు… మూడింట ఒకటో వంతు ప్రజల కలలకు సంబంధించినదని పేర్కొన్నారు. మనమంతా ఒకప్పుడు వలసపాలనలో ఉన్నాం. స్వాతంత్య్రం, ఆత్మగౌరవం కోసం పోరాడామని గుర్తు చేశారు. భారత్‌, ఆఫ్రికాలో మూడింట రెండో వంతు మంది 35 ఏళ్ల లోపు వారేనని, మన భాగస్వామ్యంలో మానవ వనరుల అభివృద్ధి కీలమని స్పష్టం చేశారు. వన్యజీవుల సంరక్షణ, పర్యాటకంలో ఆఫ్రికా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తోందని పేర్కొన్నారు. ఆఫ్రికా అభివృద్ధిలో భారత్‌ భాగస్వామ్యం కావటం గౌరవంగా భావిస్తున్నామన్నారు. గత మూడేళ్లలో ఆఫ్రికాకు చెందిన 25వేల మంది యువత భారత్‌లో శిక్షణ పొందారని తెలిపారు. ఆఫ్రికా క్రీడలు, కళలు, సంగీతం ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్నాయన్నారు.

భారత్‌-ఆఫ్రికా భాగస్వామ్యంలో అభివృద్ధి అంశమే కీలకమని, ఆఫ్రికా దేశాల అభివృద్ధికి సాయం చేస్తామని వెల్లడించారు. ఆఫ్రికాకు 600 మిలియన్‌ డార్ల సాయం ప్రకటించారు. ఐదేళ్లలో ఆఫ్రికాకు 10మిలియన్‌ డాలర్ల రాయితీ రుణం అందిస్తామని తెలిపారు. ఆఫ్రికాలో వ్యవసాయ రంగం ప్రపంచ ఆహార భద్రతకు మద్దతుగా నిలుస్తుందన్నారు. ఆఫ్రికాలో డిజిటల్‌ సాంకేతికత అభివృద్ధికి అంతరిక్ష పరిజ్ఞానం అందుబాటులోకి తెస్తామన్నారు. ఉగ్రవాదంపై పోరులో సహకారం మరింత బలపడాలని

కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మన భాగస్వామ్యానికి పునాది కావాలని ఆకాంక్షించారు. ఐరాసలో సంస్కరణల కోసం భారత్‌, ఆఫ్రికా ఏకతాటిపై నిలవాలని మోదీ కోరారు.

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

ఇండో-ఆఫ్రికన్‌ సదస్సు ముగింపు సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌తో పాటు 54దేశాల అధినేతలు పాల్గొన్నారు. 3 రోజుల పాటు దిల్లీలో ఇండో-ఆఫ్రికన్‌ సదస్సు జరిగింది.