ఆమ్‌ఆద్మీకి అశుతోష్‌ గుడ్‌బై

– పంద్రాగస్టు రోజే క్రేజీవాల్‌కు ఊహించని షాక్‌
– వ్యక్తిగత కారణాలతోనే పార్టీ వీడుతున్నట్లు అశుతోష్‌ వెల్లడి
న్యూఢిల్లీ, ఆగస్టు15(జ‌నం సాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌కు స్వాతంత్య దినోత్సవం నాడు ఊహించని షాక్‌ తగిలింది. ఆ పార్టీ సీనియర్‌ నేత, వ్యవస్థాపక సభ్యుడు అశుతోష్‌ బుధవారం గుడ్‌బై చెప్పారు. వ్యక్తిగత కారణాలతోనే తాను పార్టీని వీడుతున్నట్టు అశుతోష్‌ ప్రకటించారు. బుధవారం ఈ మేరకు ట్విటర్‌ వేదికగా అశుతోష్‌ స్పందిస్తూ.. ప్రతి ప్రయాణానికీ ఓ ముగింపు ఉంటుందన్నారు. ఆప్‌తో నా అందమైన, విప్లవాత్మక అనుబంధం కూడా ముగిసిందని పేర్కొన్నారు. నేను పార్టీకి రాజీనామా చేశానని, దీనిని ఆమోదించాల్సిందిగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ)ని కోరానని తెలిపారు. కేవలం వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని, పార్టీలో ఇప్పటి వరకు నన్ను ప్రోత్సహించిన అందరికీ కృతజ్ఞతలు అంటూ అశుతోష్‌ ట్విట్టర్‌లో తెలిపారు. రాజకీయాల్లో చేరకముందు అశుతోష్‌ టీవీ జర్నలిస్టుగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. అన్నా హజారే చేపట్టిన అవినీత
వ్యతిరేక ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో చాందినీ చౌక్‌ నుంచి ఆమ్‌ ఆద్మీ అభ్యర్థిగా పోటీచేశారు. కాగా రాజీనామా సందర్భంగా తన ప్రైవసీని గౌరవించాలంటూ అశుతోష్‌ విూడియాను కోరారు. విూడియా మిత్రులందరికీ విన్నపం. దయచేసి నా ప్రైవసీని గౌరవించండి. ఏ విషయంలోనూ నేను స్పందించదల్చుకోలేదు. దయచేసి సహకరించండి అంటూ కోరారు.