ఆరుగురు నాపై దారుణానికి పాల్పడ్డారు

ఢిల్లీ : ఢిల్లీ పోలీసుల నివేదికకు భిన్నంగా బస్సులో ఉన్న ఆరుగురు వ్యక్తులూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ అత్యాచార బాధితురాలు పేర్కొంది. పోలీసుల నివేదికలో నలుగురు అత్యాచారం చేశారని పేర్కొన్నారు. శనివారం సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ చతుర్వేది ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఆమె భావోద్వేగాలకు లోనుకాకుండా సంయమనంతో వాంగ్మూలమిచ్చినట్లు సమాచారం. తాము చేరుకోవలసిన గమ్యస్థానం వరకూ రిక్షా అతను రాలేననడంతో బస్సు ఎక్కామని ఆమె తెలిపింది. బస్సు ఎక్కిన కొద్ది నిమిషాల్లోనే అందులోని ఒక వ్యక్తి తమ ఇద్దరిపై అసభ్యంగా వ్యాఖ్యలు చేశారని ఆమె పేర్కొంది. తాము స్పందించేలోపే ఇద్దరి మీద భౌతిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారని, ఆ తర్వాత అత్యాచారం చేశారని ఆమె చెప్పింది. ఇద్దరిని బస్సులోనుంచి ఈడ్చి  కింద పడేశారని, పడగానే తాను స్పృహ కోల్పోయానని చెప్పింది. కుటుంబ సభ్యుల సమక్షంలో బలహీనమైన చిన్న గొంతుతోనే అయినా స్పష్టంగా ఎలాంటి సంకోచాలు లేకుండా ఆమె జరిగిన దారుణంపై పూర్తి వాంగ్మూలమిచ్చింది.

వన్చే క్రికెట్‌కు సచిన్‌ గుడ్‌బై

ముంబయి : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. గతకొంతకాలంగా సచిన్‌ రిటైర్మెంట్‌పై చర్చనీయాంశమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు. 39 ఏళ్ల సచిన్‌ మొత్తం 463 వన్డేలు ఆడి 18,426 పరుగులు చేశాడు. 23 ఏళ్ల కెరీర్‌లో వన్డేల్లో 49 సెంచరీలు, 96  అర్థసెంచరీలు నమోదు చేశాడు. గత వరల్డ్‌కప్‌లో ఇండియా విజయం అనంతరం సచిన్‌ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని అనుకున్నారు. అయితే ఇటీవల తన ఫాంపై విమర్శలు ఎక్కువవుతున్న నేపథ్యంలో వన్డే క్రికెట్‌ నుంచి సెలవు తీసుకుంటున్నట్లు ఈరోజు ప్రకటించాడు. కొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే పాక్‌ సిరీస్‌కు నేడు ఇండియా జట్టు ఎంపిక నేపథ్యంలో వన్డే క్రికెట్‌కు సచిన్‌ గుడ్‌బై చెప్పడం గమనార్హం.