ఆర్టీసీ స్థలాలల్లో థియేటర్లతో లాభాలకు ప్లాన్‌

రాష్ట్రవ్యాప్తంగా 59 బస్టాండ్లలో లీజుకు అవకాశం

విజయవాడ,నవంబర్‌11(జనం సాక్షి): విజయవాడ బస్టాండ్‌లో మల్టీప్లెక్స్‌ ప్రయోగం విజయవంతం కావడంతో ఇక ఎపిఎస్‌ ఆర్టీసీ ఆదాయం కోసం ఇలాంటి ప్రతిపాదనలను సిద్దం చేస్తోంది. గతంలో ఆర్టీసీ ఎండిగా పనిచేసిన డిజిపి సాంబశివరావు ఈ ప్రయోగంతో మంచి ఫలితాలను రాబట్టారు. ఆయన సూచనల మేరకు  బస్టాండ్లలో డిజిటల్‌ థియేటర్లు ఏర్పాటుచేసేందుకు ప్రైవేటు సంస్థలకు స్థలాల్ని లీజుకు ఇవ్వాలని గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. అలాగే ఆర్టీసీ బస్టాండ్ల నిర్వహణ భారం కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని 59 ముఖ్యమైన బస్టాండ్లను గుర్తించింది. ఆ బస్టాండ్లలోని ఖాళీస్థలాల్ని 15 సంవత్సరాల వ్యవధికి లీజుకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి ఉన్న సంస్థల నుంచి ఎంపిక పక్రియను ప్రారంభించింది. సంస్థల్ని ఎంపిక చేసి థియేటర్ల ఏర్పాటుకు స్థలాల్ని ఇచ్చేలా ఆర్టీసీఅధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. టిక్కెటేతర ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో స్థలాల్ని లీజుకు ఇస్తున్నామని, అదేక్రమంలో బస్టాండ్లను వినోద కేంద్రాలుగా మారుస్తున్నామని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా విజయవాడ పీఎన్‌బీఎస్‌లో స్థలాన్ని ఓ ప్రైవేటు సంస్థకు ప్రయోగాత్మకం విధానం పేరుతో లీజుకు ఇవ్వగా అక్కడ థియేటర్లు ఏర్పాటై నడస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 59 బస్టాండ్లలో స్థలాల్ని థియేటర్ల కోసం బీఓటీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది.  ఇందుకోసం అర్హత నిబంధనల్లో అధికారులు కీలక మార్పులు చేర్పులు చేశారు. ఒక సంస్థకు అర్హత లేకుంటే.. మరో ఇద్దరితో కలిసి కన్షార్షియంగా ఏర్పడి బిడ్లు దాఖలు చేసే అవకాశం కల్పిస్తున్నట్లు టెండరు నిబంధనల్లో ఏపీఎస్‌ఆర్టీసీ పేర్కొంది. ఇప్పటికే థియేటర్లు నడుపుతున్న అనుభవం కలిగి ఉండాలనడం, గడిచిన మూడేళ్లలో ఏటా కోటి టర్నోవరు సాధించి ఉండడం వంటి నిబంధనలు కూడా కొందరిని దృష్టిలో పెట్టుకున్నవే అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు, థియేటర్లు ఏర్పాటుచేసేందుకు ఒక సంస్థకు ఎన్ని బస్టాండ్లు అన్న పరిమితిని ఆర్టీసీ నిర్ణయించలేదని  సమాచారం. అర్హతల మేరకు ఎంపిక విధానాన్ని అనుసరించాలని.. ఒక్కో బస్టాండ్‌కు విడివిడిగా దరఖాస్తులు తీసుకోవాలని సంస్థ నిర్ణయించింది. మొత్తంగా ఆదాయవనరులను రాబట్టుకునే అంశాన్ని సీరియస్‌గా ఆలోచిస్తోంది.