ఆర్డీసీ డిపోలోనే డ్రైవర్‌ ఆత్మహత్య


– డిపో మేనేజర్‌ వేధింపులే కారణమంటూ సూసైడ్‌ నోట్‌
– ఆందోళనకు దిగిన మృతుడి బంధువులు
– న్యాయం చేస్తామని హావిూ ఇచ్చిన రీజినల్‌ మేనేజర్‌
– లిఖితపూర్వక హావిూలివ్వాలని పట్టుబట్టిన మృతుని బంధువులు
విశాఖపట్టణం, నవంబర్‌24(జ‌నంసాక్షి) : డిపో మేనేజర్‌ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఓ డ్రైవర్‌ తన సూసైడ్‌ నోట్‌లో పేర్కొనడంతో ఆయన కుటుంబసభ్యులు, తోటి ఉద్యోగులు ఆందోళనకు దిగిన ఘటన విశాఖ నగరంలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆర్టీసీ డిపో పరిధిలో డ్రైవర్‌గా పనిచేస్తోన్న చింతా నాగేశ్వరరావు శుక్రవారం డిపోలోనే విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ ప్రమాదం
ఘటన విషయంలో డిపో మేనేజర్‌ దివ్య వేధించడంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. దీంతో, ఒక్కసారిగా సింహాచలం ప్రాంతంలో కలకలం చెలరేగింది. తమ సహచరుడి మృతిని తట్టుకోలేని తోటి ఉద్యోగులు, బాధితుడి బంధువులు సింహాచలం ఆర్టీసీ డిపో ఎదుట శనివారం ఆందోళనకు దిగారు. కార్మిక సంఘాల నేతలు శనివారం ఉదయమే అక్కడకు చేరుకుని డీఎం దివ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఆందోళనకారులు డిపో నుంచి బస్సులను బయటకు రాకుండా అడ్డుకుని, నాగేశ్వరరావు కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. డిపో మేనేజర్‌ దివ్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయం గురించి తెలుసుకున్న రీజినల్‌ మేనేజర్‌ బాధిత కుటుంబంతో పాటు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 1991 నుంచి నాగేశ్వరరావు డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడని, ఆయన మరణం నేపథ్యంలో వారికి కుమారుడికి తొలుత ఔట్‌ సోర్సింగ్‌ కింద ఉద్యోగం ఇస్తామని తెలిపారు. తర్వాత, అతడి సర్వీసును క్రమబద్ధీకరించేలా చర్యలు తీసుకుంటామని హావిూ ఇచ్చారు. అయితే, బాధితుడి కుటుంబానికి పరిహారం చెల్లింపు తన పరిధిలో లేదని ఆయన స్పష్టం చేశారు. డిపో మేనేజర్‌పై వచ్చిన ఆరోపణల్లో వాస్తవాలను తేల్చేందుకు ప్రత్యేక అధికారితో విచారణ జరుపుతామని పేర్కొన్నారు. కాగా, ఈ హావిూలను లిఖిత పూర్వకంగా ఇస్తేనే తాము ఆందోళన విరమిస్తామని నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు తేల్చిచెప్పారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో ఆర్‌ఎం చర్చిస్తానని తెలిపినా వారు మాత్రం సనేమిరా అన్నారు. దీంతో, డిపో వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకున్నాయి.