ఆర్బీఐ సర్వర్లలో సాంకేతిక లోపం

– ఏపీలో ఉద్యోగులకు అందని జీతాలు
– ఆందోళనలో ఉద్యోగులు, పెన్షనర్లు
అమరావతి, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : ఆంధప్రదేశ్‌ రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల అకౌంట్లలో జీతాలు, పెన్షన్లు ఇంకా జమ కాలేదు. ఇందుకు రిజర్వ్‌బ్యాంకులో సాంకేతిక లోపమే కారణంగా తెలుస్తోంది. సాధారణంగా ప్రతీ నెల 30, 31 అర్ధరాత్రిలోగా ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు డిపాజిట్‌ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ ద్వారా మూడు రోజుల క్రితమే ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఫైళ్లను రిజర్వ్‌ బ్యాంక్‌ అధికారులకు అందజేశారు. 4.5లక్షల మంది ఉద్యోగులు, 3.6లక్షల మంది పెన్షనర్ల ఫైళ్లను అందుకున్నట్లు రిజర్వ్‌బ్యాంకు ధృవీకరించింది. కాగా 31అర్ధరాత్రి జీతాలు డిపాజిట్‌ అవకపోవడంతో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు సంప్రదింపులు జరిపారు. కాగా శుక్రవారం సాయంత్రం నుంచి రిజర్వ్‌బ్యాంకులో సాంకేతిక లోపం తలెత్తినట్లు గుర్తించిన అధికారులు ఈ లోపాన్ని సరిచేసి ఉదయం పది గంటలలోపు జీతాలు డిపాజిట్‌ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థికశాఖ అధికారులకు సమాచారం అందజేశారు. మధ్యాహ్నం వరకు జీతాలు డిపాజిట్‌ అవకపోవడంతో మరోసారి ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు.. రిజర్వ్‌బ్యాంకు అధికారుల దృష్టికి  తీసుకెళ్లారు. అయితే ఆర్బీఐ సర్వర్లు ఇంకా మొరాయిస్తూనే ఉన్నాయని శనివారం రాత్రి వరకు, ఆదివారం ఉదయానికి పెన్షన్లు, వేతనాలు పడే అవకాశం ఉందని వారు తెలియజేశారు. అయితే నేడు ఆదివారం కావడంతో ఆర్బీఐ సాంకేతి సిబ్బంది విధులు నిర్వహిస్తుందా? లేదా? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ఇదిలా ఉంటే జీతాల ఆలస్యం పట్ల ఉద్యోగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారానికైనా వస్తాయా అన్న సందేహంలో ఉన్నారు.

తాజావార్తలు