ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానాన్ని తిరస్కరించండి

– రాహుల్‌కు సూచించిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ..!
న్యూఢిల్లీ, ఆగస్టు30(జ‌నం సాక్షి) : రాష్టీయ్ర స్వయం సేవక్‌ సంఘ్‌ ఆహ్వానాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిరాకరించే అవకాశాలున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానాన్ని అంగీకరించొద్దంటూ కాంగ్రెస్‌ కోర్‌ గ్రూప్‌ సమావేశంలో సీనియర్‌ నేతలు రాహుల్‌కు సూచించినట్టు తెలుస్తోంది. ‘భారత భవిష్యత్తు – ఆర్‌ఎస్‌ఎస్‌ దృష్టికోణం’ అనే అంశంపై లెక్చర్‌ సిరీస్‌ను సెప్టెంబర్‌ 17 నుంచి 19వ తేదీ వరకూ ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ నిర్వహించనుంది. దీనికి హాజరుకావాలంటూ రాహుల్‌ను ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానించిదని అంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫీ మోహన్‌ భాగవత్‌ ప్రసంగించే ఈ కార్యక్రమంలో రాహుల్‌తో పాటు, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ప్రధాని మోదీ, సీనియర్‌ బీజేపీ నేతలు పాల్గొనే అవకాశాలున్నాయని ఆర్‌ఎస్‌ఎస్‌ నేత అరుణ్‌ కుమార్‌ తెలిపారు. దీంతో ఆర్‌ఎస్‌ఎస్‌ ఆహ్వానానికి రాహుల్‌ సమ్మతి తెలుపుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తరచు ఆర్‌ఎస్‌ఎస్‌పై విమర్శలు చేయడంలో ముందుండే రాహుల్‌ ఇటీవల జర్మనీ, లండన్‌ పర్యటనల్లోనూ ఆర్‌ఎస్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను సున్నీ ఇస్లామిస్ట్‌ సంస్థ ముస్లిం బ్రదర్‌హుడ్‌తో పోల్చారు. దేశంలోని అన్ని వ్యవస్థలను ఆర్‌ఎస్‌ఎస్‌ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోందన్నారు. కేరళ వరద బాధితుల పరామర్శ సమయంలోనూ నాగపూర్‌ ప్రధాన కార్యాలయం (ఆర్‌ఎస్‌ఎస్‌) ఆదేశాలతోనే బీజేపీ నడుస్తోందంటూ తప్పుపట్టారు.