ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి.

బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ డిమాండ్.
నల్గొండ బ్యూరో. జనం సాక్షి
గత రెండు రోజుల క్రితం వైయస్సార్ సిపి రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం నాయకుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి  గురుకులాలకు మహాత్మ జ్యోతిరావు పూలే పేరు పెట్టడం సరికాదని వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తొలగించి బీసీ గురుకులాలుగా మార్చాలని ఆర్ కృష్ణయ్య పేర్కొనడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ అన్నారు. ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యలకు నిరసనగా ఆదివారం జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ 40 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ చరిత్ర ఉందని చెప్పుకునే ఆర్.కృష్ణయ్యకి దేశంలోని అణగారిన వర్గాలకు అక్షరాన్ని అందించినటువంటి మహానుభావులైన జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అని వారికి తెలియకపోవడం చాలా విచారకరమన్నారు. దేశంలోని విమానాశ్రయాలకు, జాతీయ ప్రాజెక్టులకు, స్మారకాలకు పూలే పేరు పెట్టాలని డిమాండ్ చేయాల్సిన ఆర్.కృష్ణయ్య ఉన్న గురుకులాలకు ఎన్నో సంవత్సరాలుగా  ఉద్యమించి ప్రభుత్వం చేత మహాత్మ జ్యోతిరావు పూలే గురుకులాలుగా నామకరణం చేయిస్తే ఈరోజు ఆర్.కృష్ణయ్య వాటిని తొలగించడం ఎంతవరకు సబబు అన్నారు. ఎస్సీ ఎస్టీ గురుకులాలకు మహనీయుల పేరు లేనిది బీసీ గురుకులాలకు ఎందుకు అని ప్రశ్నింస్తున్న ఆయన 2007 పూలే జయంతి ఉత్సవాలలో కొందరు సొసైటీకి పూలే పేరు పెట్టమని కోరగా అత్యుత్సాహంతో పొరపాటున గురుకులాలకు అదే పేరు పెట్టారని ఆర్.కృష్ణయ్య పేర్కొనడం ఆయన సామాజిక రాజకీయ చైతన్యానికి నిదర్శనమన్నారు. బీసీ గురుకులాలకు మహాత్మ జ్యోతిరావు పూలే పేరు కొనసాగించాల్సిందేనని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎలిజాల వెంకటేశ్వర్లు, నియోజకవర్గ అధ్యక్షుడు బోళ్ల నాగరాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, కర్నాటి నిరంజన్, కోట వెంకటరమణ, మారోజు రాజ్ కుమార్, గొబ్బిళ్ళ అనిల్, కుమార్, శివరాజ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.