ఆలయాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టేలా చర్యలు

దుబారా తగ్గించాలన్నదే సర్కార్‌ భావన

ఆన్‌లైన వ్యవహారాలతో పారదర్శకతకు పెద్దపీట

అమరావతి,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): జిఎస్టీతో ఆలయాలపై భారం కాస్తా భక్తులపై ప్రభావం చూపుతోంది. దీనికితోడు ఆలయాల ఆదాయంపై నిఘా పెట్టాని ప్రభుత్వం యోచిస్తోంది. ఇటీవల జరుగుతన్న వరుస ఘటనల నేపథ్యంలో పారదర్వక పాలన చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. తిరుమల, దుర్గగుడిపై ప్రధానంగా ఆరోపనలు వెల్లువెత్తాయి. దీంతో వ్యవహారాలను ఆన్‌లైన్‌ చేసి, ప్రతిపైసాకు పక్కాగా అకౌంటింగ్‌ ఉండాలని చూస్తోంది. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో అనవసర ఖర్చులు, నిధుల దుబారాపై పూర్తిస్థాయి నియంత్రణ తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా నిధుల జమాపద్దులపై ఖచ్చితత్వంతో ఉండాలని నిర్ణయించారు. నిధుల వినియోగంపై జవాబుదారి తీసుకురావాలని, ఆర్థిక క్రమశిక్షణ ఒక్కటే ఇందుకు పరిష్కారమని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఏడు ప్రధాన ఆలయాల్లో నిధుల వినియోగం తీరు, ఇతర ఆర్థిక అంశాలపై అకౌంటింగ్‌ నిపుణులతో పరిశీలన చేయించాలనుకుంటోంది.ఇందుకోసం ఆలయాల కోసం పెద్ద ఎత్తున కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం సమకూర్చనున్నారు. దీనిపై హైలెవల్‌ కమిటీ ఓ నిర్ణయం తీసుకోనుంది. తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ఏటా వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఖర్చూ ఆ స్థాయిలోనే ఉంటుంది. అయితే నిధుల వ్యయంలో దుబారా, అక్రమాలను నిరోధించేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రతీ రూపాయి ఖర్చుకు జవాబుదారీ వచ్చింది. ఇందుకు అకౌంటింగ్‌ రంగంలో విప్లవాత్మక మైన సాంకేతిక పరిజ్ఞానాన్ని (ట్యాలీ) వినియోగిస్తున్నారు. రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం ఆలయాల్లోనూ అకౌంటింగ్‌ విధానం ఉంది. అయితే అది టీటీడీ తరహాలో లేదు. వాటిల్లో కార్య నిర్వహణ అధికారులదే పెత్తనం. వారు ఆదేశించినట్లుగా నిధుల వినియోగం జరగాలి. వీటిలో లోతైన పరిశీలన, పర్యవేక్షణ, పక్కా అకౌంటింగ్‌ విధానం లేదని ప్రభుత్వం గుర్తించింది. నిధుల దుబారా కూడా ఎక్కువగానే ఉంటోందని, అనవసర ఖర్చులు విపరీతంగా ఉంటున్నాయని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయాల్లోనూ పక్కా అకౌంటింగ్‌ విధానం తీసుకురావాలని దేవాదాయ శాఖ భావిస్తున్నది. నిపుణుల నివేదిక మేరకు ఎప్పటికప్పుడు సవిూక్ష చేసేందుకు, ప్రభుత్వ స్థాయిలో తగిన నిర్ణయాలు తీసుకునేందుకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వాన హైలెవల్‌ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.అకౌంటింగ్‌ నిపుణులు ఆలయాలను సందర్శించి నిధుల రాబడి, వ్యయం, ఇతర ఖర్చుల వివరాలను, ప్రస్తుతం కొనసాగిస్తున్న అకౌంటింగ్‌ విధానాన్ని పరిశీలిస్తారు. వారు ఇచ్చిన సిఫారసుల ఆధారంగా ఆలయాల ఆర్థిక నిర్వహణపై నివేదికలు తయారు చేస్తారు. ఆపై ఏ ఆలయంలో ఎలాంటి ఆర్థిక వ్యవస్థ నెలకొంది. అందులోని లోపాలకు చికిత్స ఎలా చేయాలన్నదానిపై హైలెవల్‌ కమిటీ నిర్ణయాలు తీసుకుంటుంది. అనంతరం ఏడు ప్రధాన ఆలయాల్లో ప్రభుత్వం ఆధునిక అకౌంట్‌ విధానం తీసుకురానుంది.

 

తాజావార్తలు