ఆలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ

ప్రత్యేక పూజలతో శివనామస్మరణ

ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న దీపోత్సవం

గుంటూరు,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లొ కార్తీక పౌర్ణమి శోభా వెల్లివిరిసింది. పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లాయి. భక్తులు పారవశ్యంతో శివనామస్మరణ చేసి కార్తీక దీపాలను వెలిగించారు. గుంటూరు జిల్లా అమరావతిలోని శ్రీ అమరేశ్వర ఆలయంలో భక్తులు పోటెత్తారు.

జిల్లాలో కార్తీక పౌర్ణమి సందడి నెలకొంది. అమరావతి, పెదకాకాని, కోటప్పకొండలోగల దేవాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. సముద్ర తీర ప్రాంతమైన సూర్యలంకలో రత్నగర్భ సాగర హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శాసనమండలి సభ్యుడు అన్నం సతీష్‌ ఆధ్వర్యంలో వైభవంగా ఐదు రకాల హారతులు ఇచ్చారు. అలాగే కోటప్పకొండలోగల త్రికోటేశ్వరుణి గిరి ప్రదక్షిణలు నిర్వహించారు. కాగా.. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి తన అనుచరులతో కలిసి గిరిప్రదక్షిణలు చేశారు. ఇంద్రకీలాద్రిపై వైభవంగా కోటి దీపోత్సవం జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున దీపాలు వెలిగించారు. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం మహానదిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్షదీపోత్సవం, జ్వాలాతోరణం నిర్వహించారు. మహానందీశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. శుక్రవారం కార్తీక పౌర్ణమిని పురష్కరించుకుని కృష్ణా జిల్లాలోగల ఆయా శివాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజామునుంచే భక్తులు పెద్దఎత్తున దేవాలయాలకు చేరుకున్నారు. అలాగే కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మంగినపూడి బీచ్‌లో కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర సముద్ర హారతి ఇచ్చి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్‌ వేదవ్యాస్‌ తోపాటు పలువురు పాల్గొన్నారు. అలాగే కృష్ణానది పరివాహక ప్రాంతాలతో పాటు హంసలదీవి, బందర్‌ బీచ్‌లో భక్తులు సముద్ర స్నానాలాచరించారు. అన్నవరంలోగల సత్యనారాయణ స్వామి సన్నిధికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్దఎత్తున ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే రత్నగిరిపై భక్తులు కార్తీక దీపాలు వెలిగించి పూజలు, వ్రతాలు నిర్వహిస్తున్నారు. కాగా… భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండుగంటల నుంచే స్వామివారి సర్వదర్శనాన్ని ప్రారంభించారు.

గుంటూరు జిల్లాలో ఘోర విషాదం

గుంటూరు జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కార్తీక పౌర్ణమిని పురష్కరించుకుని శివాలయానికి వెళుతున్న భార్యాభర్తలను ట్రావెల్స్‌ బస్సు ఢీకొనడంతో భార్య మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలైన విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓబులనాయుడుపాలెం గ్రామానికి చెందిన భార్యాభర్తలు మోటార్‌ సైకిల్‌పై జాతీయ రహదారి గుండా పెదకాకానిలోని శివాలయానికి వెళ్తున్నారు. అయితే… వెనుక నుంచి వచ్చిన యామిని ట్రావెల్స్‌ బస్సు మోటార్‌ సైకిల్‌ను ఢీకొనడంతో భార్య మృతిచెందగా భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను గుంటూరులోని జీజీహెచ్‌కు తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.