ఆలయ పూజారులను హత్యచేసిన దుండగులు

యూపి బిధునాలో పరిస్థితి ఉద్రిక్తం

అల్లర్లను అణచివేసేందుకు పోలీసుల కాల్పులు

లక్నో,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): ఓ మందిర పూజారులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు చేయడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని బిధునాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు పూజారులు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పూజారులపై దాడి జరగడంతో ఆగ్రహించిన స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వి, బిధునాలోని పలు వాహనాలకు నిప్పుపెట్టారు. అంతేగాక, పలు దుకాణాలపై దాడి చేసి అలజడి సృష్టించారు. ఈ ఘటనపై అక్కడి పోలీసులు విూడియాతో మాట్లాడుతూ.. నిన్న రాత్రి ఓ గుడి పూజారులపై దాడి జరగడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని, దీంతో అల్లర్లు చెలరేగుతున్నాయని చెప్పారు. మిధునాలో జరుగుతోన్న ఆందోళనలను అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఆందోళనకారులు రెచ్చిపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడమే కాకుండా, వారిపై రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరిపారు. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పూజారులను రామ్‌ (55), హల్కే రామ్‌ (50)గా పోలీసులు తెలిపారు. వారిరువురూ కుందర్‌కోట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి ప్రాంతంలోని భయానక్‌నాథ్‌ మందిరంలో పూజారులుగా పనిచేస్తున్నారని చెప్పారు. దుండగుల దాడిలో గాయాలపాలైన మరో పూజారిని రామ్‌ శరణ్‌ (55)గా గుర్తించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయన పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.