ఆల్‌రౌండ్‌ షోతో..

అదరగొట్టిన జూనియర్‌ ద్రవిడ్‌
– జట్టు విజయంలో కీలకపాత్ర
– 51 పరుగులు చేసి, 3వికెట్లు తీసిన సమిత్‌
బెంగళూరు, జులై27(జ‌నం సాక్షి) : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ తనయుడు అర్జున్‌ గురించి గత వారం చదివాం. అండర్‌-19 క్రికెట్‌లో తొలిసారి భారత్‌ తరఫున ఆడిన అర్జున్‌ వేసిన రెండో ఓవర్లోనే వికెట్‌ తీశాడు. ఆ తర్వాత బ్యాట్‌తో మాత్రం నిరాశ పరిచాడు. పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. మరో మాజీ క్రికెటర్‌ వారసుడు ఇప్పుడు విశేషంగా రాణిస్తున్నాడు. అతడు మరెవరో కాదు భారత మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు సమిత్‌ ద్రవిడ్‌. 12 ఏళ్ల సమిత్‌ ఆల్‌రౌండర్‌గా రాణిస్తూ ఇప్పటికే ఎన్నోసార్లు వార్తల్లోకి ఎక్కాడు. తాజాగా కొట్టొనియాన్‌ షీల్డ్‌ అండర్‌-14 పోటీలను నిర్వహించారు. ఇందులో మాల్యా అదితి ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు ప్రాతినిధ్యం వహించాడు సమిత్‌. అటు బ్యాట్‌తోనూ.. ఇటు బంతితోనూ
రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో కేంబ్రిడ్జ్‌ పబ్లిక్‌ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో సమిత్‌ జట్టు 9వికెట్ల తేడాతో విజయం సాధించింది. 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన సమిత్‌ తొమ్మిది పరుగులిచ్చి మూడు వికెట్లను దక్కించుకున్నాడు. అండర్‌-14 బీటీడబ్ల్యూ కప్‌ టోర్నీలో శతకం సాధించడంతో సమిత్‌ తొలిసారి వార్తల్లోకి ఎక్కాడు. క్రికెటర్‌గా ఎన్నో ఏళ్లపాటు సేవలు అందించిన ద్రవిడ్‌ ప్రస్తుతం అండర్‌-19, భారత్‌-ఎ పురుషుల జట్లకు కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.
——————————-