ఆసియాకప్ టీ20లో ఇండియాను గెలిపించిన రోహిత్
మిర్పూర్:గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరోసారి తనదైన దూకుడును ప్రదర్శించాడు. ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి ట్వంటీ 20 మ్యాచ్ లో రోహిత్ (83; 55 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిశాడు. టీమిండియా ఆదిలో కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో రోహిత్ తొలుత కుదురుగా ఆడినా… ఆ తరువాత తన మార్కు ఆట తీరును చూపెట్టాడు. 21 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద షకిబ్ క్యాచ్ వదిలివేయడంతో బతికిపోయిన రోహిత్.. ఆపై 62 పరుగులను చేసే క్రమంలో 27 బంతులను మాత్రమే ఎదుర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ రెండొందలకు పైగా స్టైక్ రేట్ ను సాధించడం విశేషం.
అతనికి జతగా హార్దిక్ పాండ్యా(31;16 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) నిలకడను ప్రదర్శించాడు. ఈ జోడి 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ధోని అండ్ గ్యాంగ్ తేరుకుంది. దీంతో టీమిండియా 167 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి బంగ్లాదేశ్ ముందు ఉంచకల్గింది. కాగా, స్కోరును పెంచే క్రమంలో వీరిద్దరూ చివరి ఓవర్ లో అవుట్ అయ్యారు. 19.2 బంతికి రోహిత్ అవుట్ కాగా, 19.4 బంతికి పాండ్యా పెవిలియన్ చేరాడు. ఆ తరువాత కెప్టెన్ ధోని(8 నాటౌట్; 1 సిక్స్) ఆడిన తొలి బంతికి రెండు పరుగులు తీయగా, ఆఖరి బంతిని సిక్స్ గా మలచడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 166 పరుగులు నమోదు చేసింది.టీమిండియా మిగతా ఆటగాళ్లలో శిఖర్ ధావన్(2), విరాట్ కోహ్లి(8), సురేష్ రైనా(13), యువరాజ్ సింగ్(15)లు నిరాశపరిచారు. బంగ్లా బౌలర్లలో ఆల్ అమీన్ మూడు వికెట్లు సాధించగా, మోర్తజా, మహ్మదుల్లా, షకిబుల్ హసన్ లు తలో వికెట్ తీశారు.