ఆసియా క్రీడల్లో మరో రెండు స్వర్ణాలు
భారత్ ఖాతాలో మొత్తం 67 పతకాలు
జకర్తా,సెప్టెంబర్1(జనం సాక్షి ): ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న 18వ ఆసియా క్రీడల్లో భారత్ అదరగొడుతోంది. శనివారం వరుసగా రెండు స్వర్ణాలతో భారత్ దూసుకుపోయింది. ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే కావడం విశేషం. గతంలో ఎన్నడూ సాధించని స్థాయిలో భారత్ పతకాలు సాధించింది. మరో ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే.. ప్రస్తుతం ఇండోనేషియాలో జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 15 స్వర్ణాలు సాధించింది. 1951లో మాత్రమే భారత్ 15 స్వర్ణాలు సాధించింది. ఆ తర్వాత ఇప్పుడు ఆ రికార్డును సమం చేసింది. మరోవైపు ఇప్పటి వరకూ మొత్తం సాధించిన పతకాల సంఖ్య(67)ను చూస్తే ఆసియా క్రీడల్లో భారత్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన. శనివారం మొదట పురుషుల బాక్సింగ్‌లో 49 కేజీల విభాగంలో భారత్ తొలి స్వర్ణం అందుకుంది. ఆ తర్వాత బ్రిడ్జ్‌లో మరో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. పురుషుల పెయిర్ ఫసైనల్-2లో అగ్రస్థానంలో నిలిచిన ప్రణబ్-సర్కార్ జోడీ స్వర్ణం సాధించింది. ఈ పతకాలతో ఇప్పటి వరకూ భారత్ ఖాతాలో 67 పతకాలు చేరాయి. ఇందులో స్వర్ణాలు 15, రజతాలు 23, కాంస్యాలు 29 ఉన్నాయి.