ఆసియా క్రీడల్లో మెరిసిన అథ్లెట్లు

అంతా మట్టిలో మాణిక్యాలే

పేరికాన్ని అధిగమించి సత్తా చాటారు

న్యూఢిల్లీ,సెప్టెంబర్‌4(ఆసియా క్రీడల్లో మెరిసిన అథ్లెట్లు): ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన మన అథ్లెట్లలో ఒక్కొక్కరిది భిన్నమైన నేపథ్యం. వీరిలో చాలామంది పేదరికం నుంచి వచ్చినవారే. అనేక కష్టాలు, కన్నీళ్లు దిగమింగుతూనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న వీరి ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో ఎప్పుడూ లేనంతగా అథ్లెటిక్స్‌లో 19 పతకాలు సాధించడం మరపురాని విషయం. మునుపెన్నడూ లేని విధంగా జకర్తాలో మన క్రీడాకారులు అత్యుత్తమంగా 15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలతో కలిపి ఏకంగా 69 పతకాలు సొంతం చేసుకొని రికార్డు సృష్టించారు. భారత్‌ ఇన్ని పతకాలు సొంతం చేసుకోవడం ఆసియా క్రీడల చరిత్రలో ఇదే తొలిసారి. అయితే క్రీడలకు అంతంతమాత్రమే ఆదరణ ఉన్న అరబ్‌ దేశం ఇరాన్‌ ఏకంగా 20 స్వర్ణాలతో సత్తా చాటడం చూస్తే, భారత ప్రదర్శన ఇంకా మెరుగపడాల్సిన అవసరం ఎంతైనా ఉందనిపిస్తోంది. ప్రతిసారీ 500కు పైగా అథ్లెట్లతో బరిలోకి దిగుతున్న ఒక్కసారైనా వంద పతకాలను అందుకోలేకపోతుండడం నిరాశపరిచే అంశమే. సమర్ధులైన క్రీడాకారులను గుర్తించి ఎంపిక చేయడంతోనే సరిపోదు. వారికి సకల సదుపాయాలు కల్పించాలి. వారిలోని ప్రతిభాపాటవాలను గుర్తించి, అత్యున్నత ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇప్పించాలి. మరో రెండేళ్లలో టోక్యో ఒలింపిక్స్‌ జరగ బోతున్నాయి. ఇప్పుడు సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుంటూనే, తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకొని అవి పునరావృతం కాకుండా చూసుకోవాలి. 2010 గ్వాంగ్‌ఝూ ఆసియాడ్‌లో సాధించిన 65 పతకాల ప్రదర్శన రికార్డును జకార్తాలో అధిగమించారు. భవిష్యత్‌లో మన అథ్లెట్లు మరింత మెరుగైన ఫలితాలు రాబట్టేదిశగా ఈ ఆసియాడ్‌.. భరోసానిచ్చిందని భావించవచ్చు. ఇకపోతే రెప్పపాటులో ఫలితం తారుమారయ్యే ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్‌లో భారత క్రీడాకారులు ఏకంగా ఏడు స్వర్ణాలు కొల్లగొట్టారు. షాట్‌పుట్‌లో పంజాబ్‌ స్టార్‌ తజిందర్‌పాల్‌ సింగ్‌ రికార్డు పసిడితో మొదలైన వేట.. 1500 విూటర్ల పరుగులోకేరళ రేసర్‌ జిన్సన్‌ జాన్సన్‌ స్వర్ణం సాధించే వరకు దిగ్విజయంగా సాగింది. పశ్చిమ బెంగాల్‌ యువ స్పింటర్‌ స్వప్న బర్మన్‌ క్లిష్టమైన హెఎ/-టాథ్లాన్‌లో అమోఘమైన ప్రదర్శన కనబరచింది. ఏడు ఈవెంట్ల సమాహారమైన హెప్టాథ్లాన్‌లో స్వర్ణ పతకం నెగ్గి చరిత్ర సృష్టించింది. ఓవైపు కాలివేళ్ల సమస్య, మరోవైపు పంటి నొప్పితో బాధపడుతూనే బరిలోకి దిగిన స్వప్న మేటి అథ్లెట్లను తోసిరాజని అగ్రస్థానంలో నిలిచిన తీరు చూసి యావత్‌ భారతదేశం మురిసిపోయింది. ఓసారి నిషేధానికి గురై అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఒడిశా స్పింటర్‌ ద్యూతీ చంద్‌ రెండు పతకాలతో అదరగొట్టింది. 100, 200 విూటర్ల పరుగు విభాగాల్లో రజత పతకాలు సాధించి అబ్బురపరిచింది. ద్యూతీ విజయంలో ఆమె కోచ్‌, మన తెలుగు వ్యక్తి నాగపురి రమేశ్‌ పాత్ర వెలకట్టలేనిది. వరంగల్‌కు చెందిన నాగపురి రమేశ్‌ ఆసియాడ్‌లో ద్యూతీ అత్యుత్తమ ప్రదర్శన రాబట్టేందుకు రెండేళ్లుగా శ్రమించి అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. జూనియర్‌ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి భారత్‌కు గర్వకారణంగా నిలిచిన అసోం అమ్మాయి హిమా దాస్‌ ఆసియాడ్‌లోనూ సత్తాచాటుతూ 400 విూటర్ల రేసులో రజత పతకాన్ని ముద్దాడింది. దీంతో పాటు 4చీ400 విూటర్ల రిలే ఈవెంట్‌లో సహచరులు సరితా గైక్వాడ్‌, పూవమ్మ, విస్మయలతో కలిసి స్వర్ణం అందుకొంది. 5 ఏళ్ల శార్దూల్‌ విహాన్‌, 16 ఏళ్ల సౌరభ్‌ చౌధురి పతకాలు నెగ్గి షూటింగ్‌లో భారత్‌ సత్తా చాటిచెప్పారు. రెజ్లింగ్‌లో బజరంగ్‌ పూనియా, వినేష్‌ ఫొగట్‌, బాక్సింగ్‌లో అమిత్‌ పంఘాల్‌ స్వర్ణాలతో సత్తాచాటగా, తొలిసారిగా బ్రిడ్జ్‌ ఈవెంట్‌లోనూ మన క్రీడాకారులు పతకాలు కొల్లగొట్టడం శుభ పరిణామం. కబడ్డీలో మాత్రం ఇన్నాళ్లూ రారాజుగా వెలుగొందిన భారత్‌ ఈమారు అనూహ్యంగా ఇరాన్‌ జట్టు ముందు బోల్తా పడడం మింగుడుపడని పరిణామమే. హాకీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా పోటీపడ్డ భారత పురుషుల జట్టు ఈసారి కంచు పతకానికి పడిపోయి నిరాశపరచగా.. మహిళలు మాత్రం అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ దాకా చేరుకోవడం ప్రశంసనీయం. బ్యాడ్మింటన్‌లో సింధు, సైనా వరుసగా రజత, కాంస్య పతకాలతో మెరవగా.. స్క్వాష్‌లో దీపికా పళ్లికల్‌, జోష్న చిన్నప్ప బృందం పతకాలతో అదరగొట్టింది.