ఆసీస్కు భారీ లక్ష్యం
మెల్ బోర్న్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లోనూ టీమిండియా అదరగొట్టింది. ఆసిస్ ముందు 185 పరుగులు భారీ టార్గెట్ ఉంచింది. మరోసారి ఓపెనర్ రోహిత్, విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్ తో అదరగొట్టగా.. ధావన్ సుడిగాలి ఇన్నింగ్స్ తో మెరిసాడు. ధోనీ సైతం 14 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది.
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా కు ఓపెనర్లు రోహిత్, ధావన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. పోటాపోటీగా రెచ్చిపోయి తొలి వికెట్ కు 97 పరుగుల భారీ పార్టనర్ షిప్ నమోదు చేశారు. 32 బంతుల్లోనే 3 ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 రన్స్ చేసిన ధావన్.. మ్యాక్స్ వెల్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. రోహిత్ కు జతైన కోహ్లీ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ తో అలరించారు.
ఆసిస్ బౌలర్లపై మరోసారి పూర్తి పైచేయి సాధించిన కోహ్లీ.. సూపర్బ్ బ్యాటింగ్ తో అలరించాడు. మరో ఎండ్ లో రోహిత్ సైతం రెచ్చిపోవడంతో స్కోర్ బోర్డ్ ఉరకలెత్తింది. 47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 60 రన్స్ చేసిన రోహిత్ రనౌట్ అయ్యాడు.
29 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ తో టీ20 కెరీర్ లో 11వ అర్థసెంచరీ చేసిన కోహ్లీ .. 59 పరుగులతో చివరి వరకు క్రీజ్ లో నిలిచాడు. ధోనీ 14 పరుగులు చేసి చివరి ఓవర్ లో వెనుదిరిగాడు. ఆసిస్ బౌలర్లలో తై, మాక్స్ వెల్ తలో వికెట్ తీశారు.