ఆస్ట్రేలియా పోలీసుల్లో సగం మంది లైంగిక వేధింపుల బాధితులే

సిడ్నీ : ఆస్ట్రేలియాలో రక్షకులకే రక్షణ కరవవుతోందట. ఆస్ట్రేలియన్ నేషనల్ పోలీసు దళంలో పనిచేస్తున్న మహిళల్లో సగం మందికి పైగా ఉద్యోగ జీవితంలో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారట. ఈ పరిస్థితుల్లో అత్యవసరంగా మార్పు రావాలని సోమవారం విడుదలైన ఓ నివేదిక పేర్కొంది. అదేవిధంగా ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసు దళంలో వర్క్‌ప్లేస్ కల్చర్ గురించి సర్వే జరిగింది. దీనిలో పనిచేస్తున్న స్త్రీ, పురుషుల్లో 60 శాతం మందికి పైగా వేధింపులకు గురవుతున్నారని తేలింది. ‘‘కల్చరల్ ఛేంజ్ : జెండర్ డైవర్సిటీ అండ్ ఇంక్లూజన్ ఇన్ ది ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీస్’’ పేరుతో ఈ సర్వే జరిగింది.
సెక్స్ డిస్క్రిమినేషన్ మాజీ కమిషనర్, ఈ నివేదిక రూపకర్త ఎలిజబెత్ బ్రాడరిక్ మాట్లాడుతూ లైంగిక వేధింపుల సమస్యపై సత్వరమే చర్యలు చేపట్టాలన్నారు. సర్వేలో పాల్గొన్నవారిలో 46 శాతం మంది మహిళలు, 20 శాతం మంది పురుషులు తాము గత ఐదేళ్ళలో వర్క్‌ప్లేస్‌లో లైంగిక వేధింపులకు గురయ్యామని తెలిపారన్నారు. ఈ గణాంకాలు జాతీయ సగటు కన్నా రెట్టింపు అని తెలిపారు. పురుషుల్లో 62 శాతం మంది, మహిళల్లో 66 శాతం మంది తమకు గత ఐదేళ్ళలో బెదిరింపులు ఎదురైనట్లు చెప్పారన్నారు.
లైంగిక వేధింపుల గురించి ఫిర్యాదు చేస్తే తమ కెరీర్ దెబ్బతింటుందన్న భయం చాలా మంది పోలీసులకు ఉందని ఈ నివేదిక పేర్కొంది. మరికొందరు ఫిర్యాదుల పరిష్కారం కోసం చాలా కాలం పడుతుందని, అయినా దర్యాప్తులో విశ్వసనీయత సందేహాస్పదమేనని మరికొందరు పోలీసు సిబ్బంది తెలిపారు.