ఆహారం చోరీ నేరం కాదు: ఇటలీ కోర్టు

రోమ్: నిరాశ్రయులు, నిరుపేదలు ఆహారాన్ని దొంగిలించడం తప్పుకాదని ఇటలీ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఉక్రెయిన్‌కు చెందిన రోమన్ ఓస్టియోకోవ్ ఉత్తర ఇటలీలోని జెనోవాలో ఉంటున్నాడు. 2011లో అతను 5 డాలర్ల విలవైన చీజ్, సాసేజ్ ను ఒక సూపర్ మార్కెట్ నుంచి దొంగిలించాడు. దాంతో అతడిని దోషిగా నిర్ధారించిన దిగువ కోర్టు అతనికి ఆరు నెలల జైలు శిక్ష, 100 యూరోలు ఫైన్ విధించింది.

నిందితుడు చేసిన తప్పునకు పశ్చాత్తాప పడుతున్నాడని, అతనికి శిక్షను తగ్గించాలని ప్రభుత్వ న్యాయవాది సుప్రీం కోర్టును కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. ఆకలితో ఉన్న నిరుపేదలు తిండి కోసం చేసిన దొంగతనాన్ని నేరంగా పరిగణించలేమని, అది పెద్ద తప్పు కాదని స్పష్టం చేసింది. అతనికి కింది కోర్టు విధించిన శిక్షను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది.