ఆ ఇద్దరికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్రక్రియలు

వర్షంలోనే  కిడారి శవయాత్ర
నివాళి అర్పించిన మంత్రులు
బంద్‌తో బోసిపోయిన మన్యం
డుబ్రిగూడ ఎస్‌ఐ సస్పెన్షన్‌
విశాఖపట్టణం,సెప్టెంబర్‌24(జ‌నంసాక్షి):  మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరు సోమ మృతదేహాలకు శవపరీక్ష పూర్తిచేశారు. కిడారి మృతదేహాన్ని పాడేరుకు, సోమ మృతదేహాన్ని భట్టివలసకు తరలించారు. వీరికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వీరి హత్యను నిరసిస్తూ వివిధ సంఘాలు  అరకు బంద్‌కు పిలుపునివ్వంతో మన్యంలో పోలీసులు భారీగా మోహరించారు.కిడారి సర్వేశ్వరరావు అంతిమ యాత్ర పాడేరులో వర్షంలోనే కొనసాగింది. మంత్రులు అయ్యన్నపాత్రుడు, నక్కా ఆనందబాబు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు. పాడేరులో భారీ వర్షం కురుస్తుండటంతో కిడారు అంత్యక్రియలకు ఆటంకం ఏర్పడింది. వర్షంలోనే ఆయన అంతిమ యాత్ర కొనసాగించారు.పెద్ద సంఖ్యలో తెదేపా కార్యకర్తలు, అభిమానులు ఈ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. నక్సల్స్‌ దుశ్చర్యను ఖండిస్తూ నినాదాలు చేశారు. మరోవైపు, గిరిజనుల కన్నీటి వీడ్కోలు మధ్య సివేరి సోమ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అరకులోని ఆయన స్వస్థలం బట్టివలసలో నిర్వహించిన అంత్యక్రియలకు గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అధికార లాంఛనాలతో కైస్త్రవ సంప్రదాయ పద్ధతిలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఇకపోతే ఈ ఘటన తరవాత మన్యంలోని అన్ని ప్రాంతాలను గ్రేహౌండ్స్‌ దళాలు జ్లలెడ
పడుతున్నాయి. అల్లర్లను నివారించడంలో విఫలమయ్యారంటూ డుంబ్రిగూడ ఎస్‌ఐ అమ్మన్‌రావును డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై విచారణ కోసం విశాఖ డీసీపీ ఫకీరప్ప నేతృత్వంలో సిట్‌ ఏర్పాటుచేశారు. కిడారి, సోమ హత్యలతో విశాఖ మన్యం మూగబోయింది. నిత్యం పర్యాటకులతో కళకళలాడే అరకు లోయ నిన్నటి నుంచి కళ తప్పింది. రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల పిలుపుతో అరకులో బంద్‌ కొనసాగుతోంది. వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల అంత్యక్రియలకు వెళ్లనున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను ఆకాశమార్గంలో అరకుకు పంపడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అంత్యక్రియలకు జిల్లా మంత్రులు, ఇన్‌ఛార్జి మంత్రి, ప్రజా ప్రతినిధులంతా హాజరయ్యారు.
షాక్‌కు గురయ్యా: గిడ్డి ఈశ్వరి
అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు మావోయిస్టుల చేతిలో హత్యకు గురికావడం తనను షాక్‌కు గురిచేసిందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. పాడేరులో కిడారి మృతదేహానికి నివాళులర్పించిన ఆమె… ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడుతూ.. కిడారి సర్వేశ్వరరావు తన కుటుంబసభ్యుడని.. తన పిన్ని కుమార్తెకు భర్త అని తెలిపారు. ఆయన మరణవార్త వినగానే కుటుంబసభ్యులమంతా దిగ్భాంతికి  గురైనట్లు చెప్పారు. పాడేరులో తాను, అరకులో సర్వేశ్వరరావు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశామని.. గిరిజన గ్రామాల్లో వందల కోట్ల నిధులు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించినట్లు ఈశ్వరి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమమైన గ్రామదర్శినిలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తున్న ఆయన్ని మావోయిస్టులు హతమార్చడం దారుణమన్నారు. తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఎక్కడికెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారని.. ఇలాంటి సమయంలో ఇంతటి విషాదం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. బాక్సైట్‌ తవ్వకాలే ఈ హత్యకు కారణమని చెప్పలేమన్నారు. ఇటీవల అరకులో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. అరకులో బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టమని ప్రకటించారని ఆమె గుర్తుచేశారు. కిడారి హత్య జరిగిన వెంటనే పోలీసులు తనకు ఫోన్‌ చేసి సున్నితమైన ప్రాంతాల్లో పర్యటించొద్దని సూచించారని ఆమె తెలిపారు. తమకు హాని ఉందని చెప్పి ప్రజా క్షేత్రంలోకి వెళ్లకుండా ఉండలేమని ఆమె స్పష్టం చేశారు.

తాజావార్తలు