ఆ ముగ్గూరు కలసి రాష్ట్రంలో కుట్ర

జగన్‌, పవన్‌ పాత్రలపై బాబు మండిపాటు

అనంతపురం,నవంబర్‌23(జ‌నంసాక్షి): ప్రధాని మోదీ, జగన్‌, పవన్‌ కలిసి రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారని సిఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ విషయంలో వీరి పాత్రపైనా ప్రతిపక్ష నేత జగన్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను సీఎం చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో వైసీపీ, జనసేన ఎందుకు పోటీ చేయడం లేదని, మోదీ, జగన్‌, పవన్‌, కేసీఆర్‌ కలిసి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. దేశ ప్రయోజనాల కోసం బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తున్నానని, జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు మూడు పార్టీలు కలిసి వస్తే.. కుట్రతో అక్కడి ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేయించిందని విమర్శించారు. బీజేపీ తప్పుడు పనులను ప్రశ్నించాలని, సరైన సమయంలో బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

కేంద్రంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నోట్ల రద్దుతో ప్రజలకు కొత్త కష్టాలు తీసుకొచ్చారు. జీఎస్టీతో వ్యాపారులను ఇబ్బంది పెడుతున్నారు. సీబీఐ, ఆర్బీఐలో సంక్షోభంపై మోదీ ఏం సమాధానం చెబుతారు. ఈడీ, ఐటీలను టీడీపీ నేతలపైకి ఎక్కుపెట్టారు. ప్రాజెక్టుల నిర్మాణానికి కోడి కత్తి పార్టీ అడ్డుపడుతోంది. అనంతను ఆదుకుంటానన్న పవన్‌ ఎక్కడికి వెళ్లారు? అవిశ్వాసం పేరుతో వైసీపీ, జనసేన నాటకాలాడాయని చంద్రబాబు మండిపడ్డారు. కరువు జిల్లాలో కియా కారు రానుందని, జనవరిలో కియా కారు రాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన

ఆయన కప్పలబండ గ్రామదర్శినిలో పాల్గొని ప్రసంగించారు. హంద్రినీవా నీటితోనే సాధ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 36 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పెళ్లి రోజునే చంద్రన్న పెళ్లి కానుక అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 16 లక్షల కోట్ల పెట్టుబడితో 30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సీఎం యువనేస్తం కింద నిరుద్యోగులకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నట్లు చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా జిల్లాలోని అన్ని చెరువులకు నీరిస్తున్నామని, మైక్రో ఇరిగేషన్‌తో నీటి పొదుపు సాధ్యమని చంద్రబాబు పేర్కొన్నారు.