ఇండియన్ స్టూడెంట్స్పై చర్యలు
వాషింగ్టన్: అనుకున్నది జరగబోతోంది. స్టూడెంట్ వీసాలపై వచ్చి అమెరికాలోనే స్థిరపడిపోవాలనే ఉద్దేశంతో ఒక అక్రమ సంస్థతో చేతులు కలిపిన భారతీయ విద్యార్థులపై తాము చర్యలు తీసుకుంటామని ఆ దేశ అధికారులు చెప్పారు. 306మంది ఇండియన్ స్టూడెంట్స్ అక్రమాలకు పాల్పడ్డారని, వీరిపై చర్యలు ఉంటాయని ప్రభుత్వ అధికార ప్రతినిధి మార్క్ టోనర్ తెలిపారు.
కొందరు బ్రోకర్లు, అమెరికాకు చెందిన హోమ్ లాండ్ సెక్యూరిటీ సంస్థలోని ఇంకొందరు వ్యక్తులు కుమ్మక్కై 2013లో క్రాన్ఫోర్డ్లో యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ అనే పేరుతో బోగస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. స్థానికంగా విద్యాసంస్థలకు అనుమతినిచ్చే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ దీనికి రాష్ట్ర స్థాయి యూనివర్సిటీగా గుర్తింపునిస్తూ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. కానీ, ఇది పైకి యూనివర్సిటీ భవనంలాగే కనిపించినా అక్కడ పాఠాలు లేవు.. పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు లేరు. కేవలం హెచ్ 1 వీసాకు నిరాకరించబడిన వారిని చేర్చుకొని భారీ మొత్తంలో డబ్బులు దండుకునేందుకు స్థాపించబడిందే ఈ బోగస్ వర్సిటీ. ఈ విషయం ఒక స్టింగ్ ఆపరేషన్ ద్వారా తెలిసింది.
సాధారణంగా అమెరికా విద్యకోసం వెళ్లిన వారికి తొలి ఏడాదిన్నరలో కర్రిక్యులమ్ ప్రాక్టికల్ ట్రైనింగ్(సీపీటీ) ప్రోగ్రాం పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఆఫ్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) అనే మరో కార్యక్రమం ఉంటుంది. ఇవి పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులు హెచ్ 1 వీసాకోసం దరఖాస్తు చేసుకుంటుంటారు. అయితే, ఏకారణం రీత్యానైనా వారికి హెచ్ 1 వీసా లభించని పక్షంలో ఆ విద్యార్థులు ఆ దేశం విడిచి తమ స్వదేశాలకు రావాల్సి ఉంటుంది. అయితే, అలా రాకుండా ఉండేందుకు మరో యూనివర్సిటీలో ప్రవేశం పొంది.. తిరిగి సీపీటీ, ఓపీటీలు పూర్తి చేసి హెచ్ 1 వీసాకోసం ప్రయత్నిస్తారు.
వాస్తవానికి ఒకసారి హెచ్ 1వీసాకు నిరాకరించబడిన విద్యార్థులను ఏ యూనివర్సిటీలు రెండోసారి చేర్చుకోవు. అలా చేయడం నేరం కూడా. కానీ, యూనివర్సిటీ ఆఫ్ నార్తర్న్ న్యూజెర్సీ మాత్రం భారతీయ విద్యార్థులను డబ్బులకోసం బుట్టలో వేసుకొని ప్రవేశాలు ఇచ్చింది. ఇందులో వెయ్యిమంది ఇండియన్ స్టూడెంట్స్ ఉండగా వారిలో 306మందికి ముందే ఈ వర్సిటీ బాగోతం తెలుసు.
అంటే ఉద్దేశ పూర్వకంగా అమెరికాలో ఉండిపోయేందుకు అక్రమ వర్సిటీతో వారు చేతులు కలిపారన్నమాట. ప్రస్తుతం ఆ విద్యార్థులపైనే చర్యలు తీసుకుంటామని అమెరికా అధికారులు అంటున్నారు. అయితే, వాస్తవానికి ఆ వర్సిటీ గురించి తెలియని విద్యార్థులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోబోమని కూడా టోనర్ చెప్పారు. ఒక అక్రమ సంస్థ ద్వారా ప్రవేశాలు పొంది శాశ్వతంగా ఉండిపోవాలని ప్రణాళిక రచించడం తప్పేనని చెప్పారు.