ఇంధన రంగంలో..  దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం

– తక్కువ కాలంలోనే మిగులు విద్యుత్‌ను సాధించాం
– 18లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం
– అమరావతిని ఎడ్యుకేషన్‌, హెల్త్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం
– ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుంది
– ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
– ‘ఇంధన రంగం, మౌళిక వసతులు కల్పన’పై శ్వేతపత్రం విడుదల
అమరావతి, డిసెంబర్‌29(జ‌నంసాక్షి): విద్యుత్‌ రంగంలో చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని , ఒకప్పుడు విద్యుత్‌ రంగంలో చీకట్లు ఉండేవని, ప్రస్తుతం మిగులు విద్యుత్‌ సాధించామని, ఫలితంగా ఇంధన రంగంలో దేశంలోనే అగ్రగ్రామిగా ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ప్రజా వేదిక హాలులో  ఏడో శ్వేతపత్రం విడుదల చేశారు. ఇంధన రంగం, మౌలిక వసతులు కల్పనపై చంద్రబాబు  శ్వేతపత్రం విడుదల చేసి మాట్లాడారు. పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థిక అభ్యున్నతికి మూలం మౌలిక రంగమని చంద్రబాబు పేర్కొన్నారు. అందుకే ఆ రంగం అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. కీలకమైన మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టామని, మొత్తం 617 అవార్డులు ఆంధప్రదేశ్‌ను వరించాయన్నారు. 1998లోనే తొలి తరం విద్యుత్‌ సంస్కరణలు
తీసుకొచ్చామని, సంస్కరణల వల్ల దేశంలో ఇంధన రంగంలో అగ్రగామిగా ఉన్నామని తెలిపారు. 2004 నుంచి 2014 వరకు విద్యుత్‌ రంగంలో చీకట్లు ఉన్నాయని, తొలిసారిగా ప్రైవేట్‌ రంగంలో విద్యుత్పత్తి కేంద్రాలు వచ్చాయని, రాష్ట్ర విభజన వల్ల మరింత కష్టాల్లోకి విద్యుత్‌ రంగం వెళ్లిందన్నారు. తక్కువ కాలంలోనే మిగులు విద్యుత్‌ సాధించాం. రెండోతరం విద్యుత్‌ సంస్కరణలు ప్రవేశపెట్టామని తెలిపారు.
పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి..
పునరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టిపెట్టామని, సౌర, పవన, హైబ్రీడ్‌ విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. విద్యుత్‌ సరఫరా, పంపిణీ నష్టాలను తగ్గించామన్నారు. స్వల్పకాలంలోనే మిగులు విద్యుత్‌ సాధించామని సీఎం వెల్లడించారు. 2014లో సౌర విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ.6.50 ఉంటే 2018 నాటికి రూ.2.70కి చేరిందన్నారు. ఇప్పటి వరకు 31,725 సౌరవిద్యుత్‌ పంపుసెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అనంతపురం, కడప, కర్నూలులో 4 వేల మెగావాట్ల సామర్ధ్యంతో సోలార్‌ పార్కులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 1,850 మెగావాట్ల సోలార్‌ పార్క్‌లు ఏర్పాటు చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. పునరుత్పాదక విద్యుత్‌ రంగంలో 13 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. రాయలసీమకు చెందిన యువత ప్రయోజనాలు పొందారన్నారు. సుజ్లాజ్‌, గమెసా, రీజెన్‌ వంటి విద్యుత్‌ సంస్థలు ఏపీలో తయారీ కేంద్రాలను ఏర్పాటు చేశాయని తెలిపారు. భారీగా ఇంధన సంరక్షణ, పొదుపును ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.2 కోట్ల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ చేశామని, 110 మున్సిపాలిటీల్లో 6.23 లక్షల ఎల్‌ఈడీ వీధి బల్బులు అమర్చామని చెప్పారు. గ్రామాలలో ఇప్పటికే 20 లక్షల వీధిలైట్ల ఏర్పాటు చేసినట్లు సీఎం చెప్పుకొచ్చారు. పెట్టుబడి లేకుండా 30శాతం విద్యుత్‌ను ఆదా చేశామన్నారు. 44,814 వ్యవసాయ పంపుసెట్ల స్థానంలో ఇంధన సమర్ధత కలిగిన ఐఎస్‌ఐ పంపుసెట్లు అమర్చామన్నారు. 2013-14లో 14శాతంగా ఉన్న విద్యుత్‌ సరఫరా, పంపిణీ నష్టాలను 2018 నవంబర్‌ నాటికి 9.7శాతంకి తగ్గించామని తెలిపారు. 2018-19 సంవత్సరానికి విద్యుత్‌ రంగానికి రాయితీల కింద రూ.6,030 కోట్లు కేటాయించామన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు 137 పురస్కారాలు వచ్చాయని తెలిపారు. 2020 వరకు విద్యుత్‌ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయించామని సీఎం పేర్కొన్నారు. రూ.50 వేల కోట్లు పెట్టుబడులు పెడితే 20 శాతం సౌర విద్యుత్‌ వస్తుందన్నారు. 18 లక్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నామని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
నౌకా రవాణా పరంగా అగ్రస్థానంలో నిలిచాం..
ఓర్వకల్లులో విమానాశ్రయం జనవరిలో ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని, నౌకా రవాణా పరంగా ఆంధప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖసహా అన్ని పోర్టుల నుంచి 116.9 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా అయ్యిందన్నారు. దుగరాజపట్నం పోర్టు విషయంలో కేంద్రం అన్యాయం చేసిందన్నారు. కాకినాడ, భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం తెలిపారు. జగ్గయ్యపేట, విజయవాడ, విశాఖ, కాకినాడ జల రవాణ కేంద్రాలను మెరుగుపరుస్తున్నామని తెలిపారు. పైపు లైన్ల ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేసేందుకు వీలయ్యే ప్రాజెక్టులను చేపట్టామన్నారు. దీని ద్వారా 30శాతం అదనంగా గ్యాస్‌ సరఫరాకు వీలు కలుగుతుందన్నారు. ఇంటింటికీ పైబర్‌ నెట్‌ ద్వారా ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించాం. ఆర్థిక నగరాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. జక్కంపూడి సిటీని ఒక నమూనాగా తీసుకుని మొదలు పెట్టాం’ అని చంద్రబాబు చెప్పారు. ఓడల ద్వారా సరుకు రవాణాలో 117 నుంచి 173 మిలియన్‌ యూనిట్లకు వెళ్లామని చంద్రబాబు
పేర్కొన్నారు. భావనపాడు, కాకినాడ, మచిలీపట్నం, రామాయపట్నం, ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. జగ్గయ్యపేట, విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ జల రవాణా కేంద్రాలను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పైప్‌లైన్ల ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ సరఫరా చేసేందుకు అవసరమైన ప్రాజెక్టులను చేపట్టామన్నారు. దీని ద్వారా అదనంగా 30 శాతం గ్యాస్‌ సరఫరాకు వీలు ఉంటుందని తెలిపారు. టవర్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశామని, ఇంటింటికీ పైబర్‌ నెట్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందజేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
అమరావతిని ఎడ్యుకేషన్‌, హెల్త్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం..
ఆర్థిక నగరాలను అభివృద్ధి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. జక్కంపూడిని ఒక నమూనాగా తీసుకున్నామన్నారు. గ్రీన్‌ అండ్‌ బ్లూ సిటీగా అమరావతి తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రపంచంలోని ఐదు అత్యుత్తమ నగరాల్లో అమరావతి ఒకటిగా నిలుస్తుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తొలిదశలో రూ.51 వేల కోట్లు, రెండో దశలో రూ. 50 వేల కోట్లు అవసరం అవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. 2మిలియన్ల మందికి ఉద్యోగాలు సృష్టించే నగరం అమరావతి అని పేర్కొన్నారు. ఎస్‌ఆర్‌ఎం, అమృత్‌, విట్‌ వంటి వర్సిటీలు వచ్చాయని చెప్పారు. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తున్నాయన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్‌, హెల్త్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టం చేశారు. 80వేల ¬టల్‌ గదులు రాజధానికోసం అవసరమని, 2400 కిలో విూటర్ల మేర రహదారులను అభివృద్ధి చేశామని చెప్పారు. 11జాతీయ రహదారులను అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. 130 వంతెనలు కొత్తగా నిర్మాణంలో ఉన్నాయని చంద్రబాబు తెలిపారు.
ట్రాఫిక్‌ అవసరాలకు అనుగుణంగా రోడ్ల విస్తరణ ఉంటుందన్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో ట్రాఫిక్‌ నిర్వహణ ఉంటుందని తెలిపారు. రహదారులపై గుంతలు ఉండకుండా నిర్వహణ వ్యవస్థను ప్రైవేట్‌ భాగస్వామ్యానికి అప్పగిస్తున్నామని సీఎం తెలిపారు. లాజిస్టిక్‌ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. రోడ్‌ కార్గో, రైల్‌ కార్గో, ఫ్లయిట్‌, సీ కార్గోలతో కూడిన ప్రజా రవాణాను అభివృద్ధి చేయాలని బాబు అన్నారు. వయాడక్ట్‌ విధానాన్ని తప్పకుండా అమలు చేస్తామన్నారు. అమరావతిలో అందరికీ ఇళ్లు ఇస్తున్నామని, 500 ఎకరాలు ఇళ్ల కోసం రిజర్వ్‌ చేసి ఉంచామని సీఎం చంద్రబాబు తెలిపారు.
పుస్తకావిష్కరణ …
అంతకుముందు ప్రభుత్వ సాధించిన ప్రతి విజయం, ప్రజలకే అంకితం పేరుతో సమాచార శాఖ విడుదల చేసిన పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థిక అభ్యున్నతికి మూలం మౌలిక రంగమని అన్నారు. 615 పురస్కారాలు, ప్రభుత్వం సాధించిన విజయాలకు కరదీపిక అని చంద్రబాబు తెలిపారు.