ఇక నరసింహావతారమే

కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తేనే తెలంగాణ
డెడ్‌లైన్లుండవు… ఇక కాంగ్రెస్‌కు డెత్‌లైన్లే
ఆత్మహత్యలు వద్దు..పోరాడండి
మధ్యంతర ఎన్నికలకు తాము సిద్ధం
జేఏసీతో సమస్యలు పరిష్కరించుకుంటాం
మేధోమథన సదస్సులో కేసీఆర్‌
కరీంనగర్‌, నవంబర్‌ 8 (జనంసాక్షి):
చర్చలు..గిర్చలు ఉండబోవని ఇక నరసింహావతారమేనని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తేల్చిచెప్పారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడమే తమ లక్ష్యమని, ఇక నుంచి కాంగ్రెస్‌కు డెడ్‌లైన్లు ఉండవని, డెత్‌లైన్లే ఉంటాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కరీంనగర్‌లో రెండు రోజుల పాటు నిర్వహించిన మేధోమథనం సమావేశాలు గురువారం ముగిశాయి. ఈ సమావేశాల్లో పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం తమకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ మరోసారి నమ్మి మోసపోబోమని తెలిపారు. మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్సే చెబుతోందన్నారు. ఈ నేపథ్యంలో తాము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంటామని చెప్పారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ఇక ఉద్యమ కార్యాచరణ ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ చేసిన మోసానికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించారు. గత పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సందర్భంలో నెల రోజుల పాటు తాను కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలతో జరిపిన చర్చల వివరాలను కేసీఆర్‌ పార్టీ నాయకులకు పూర్తిగా విశ్లేషించారు. తాను సోనియా గాంధీ ఆహ్వానం మేరకే ఢిల్లీలో ఉన్నానని, కాంగ్రెస్‌ అధిష్టానం పెద్దలు తనతో పలు దఫాలుగా చర్చలు జరిపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంకేతాలు ఇచ్చి మోసం చేశారని, కాంగ్రెస్‌ పెద్దల హామీతోనే దసరాలోపు తెలంగాణ వస్తుందని ప్రకటించానే తప్ప ఎవరినీ మభ్య పెట్టేందుకు కాదని కేసీఆర్‌ వివరణ ఇచ్చారు. తమ పార్టీలోకి ఎవరిని పడితే వారిని తీసుకోబోమని తెలిపారు. సీమాంధ్ర పార్టీలు ఎందుకోసం తెలంగాణలో అడుగుపెడుతున్నాయని ప్రశ్నించారు. విద్యార్థులు, యువకులు దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దని కేసీఆర్‌ చేతులెత్తి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం చేస్తున్న పోరాటం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యువకుల బంగారు భవిష్యత్‌ కోసమేనని తెలిపారు. ఆత్మహత్యలు చేసుకుని ఉద్యమకారుల మనసు గాయపర్చినట్లేనని, అది తమను నిరాశకు గురిచేస్తుందని వ్యాఖ్యానించారు. ఎవరికి ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన రానివ్వద్దని కోరారు. ఎవరైనా నిరాశకు గురైతే తనను నేరుగా వచ్చి కలిసి లేదా ఫోన్‌లో వాళ్ల బాధను పంచుకోవాలని కేసీఆర్‌ చెప్పారు. యువకులు ఉద్యమశక్తులుగా ఎదిగి రాష్ట్రం ఏర్పాటును అడ్డుకుంటున్న వారిని మట్టి కరిపించాలి తప్ప బలిదానాలు చేసుకోవద్దన్నారు. బీజేపీతో టీఆర్‌ఎస్‌కు విభేదాలు ఉన్నమాట వాస్తమేనని కేసీఆర్‌ చెప్పారు. బీజేపీ ఒక మతవాద పార్టీ అని పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయ జేఏసీతో అభిప్రాయ భేదాలు ఉన్నట్టు కేసీఆర్‌ అంగీకరించారు. ఇందుకు గల కారణాలను కూడా సమావేశంలో ఆయన వివరించారు. త్వరలోనే కోదండరాంతో సమావేశమై అభిప్రాయ భేదాలను తొలగించుకుంటామని, ఇందులో మరో ప్రశ్నకు తావులేదంటూ కేసీఆర్‌ తెలిపారు. ఇంతకాలం టీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటున్న ప్రజా సంఘాలను కూడా పిలిచి మాట్లాడుతామని కేసీఆర్‌ వెల్లడించారు. జేఏసీతో విభేదాలు ఉన్నాయన్న సీమాంధ్ర మీడియా ప్రచారానికి తెరదింపడానికి త్వరలో జేఏసీ సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. జేఏసీతో సమావేశం అనంతరం అంతా కలిసి ఉద్యమాన్ని పతాకస్థాయికి నడిపిస్తామని చెప్పారు. చిన్న చిన్న బేధాభిప్రాయాలను పెద్దది చేసి చూపిస్తున్నారని విమర్శించారు. సీమాంధ్ర మీడియా చేసే ప్రచారాలను చూసి ప్రజలు గందరగోళం పడవద్దని ఆయన తెలంగాణ ప్రజలను కోరారు. సీట్లు ఓట్ల వైపు టిఆర్‌ఎస్‌ మళ్ళిందని ప్రచారం చేస్తున్న సీమాంధ్ర మీడియా కాంగ్రెస్‌, టీడిపీ తెలంగాణ నాయకులు ఆ పార్టీలకు బానిసలుగా ప్రవర్తిస్తున్న తీరును చూపించడం లేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు స్వీయరాజకీయ అస్థిత్వాన్ని కలిగినప్పుడే తెలంగాణ స్వప్నం సాకారమవుతుందన్న విషయం జగమెరిగిన సత్యమని కేసీఆర్‌ తెలిపారు. ఆ వైపుగా తెలంగాణ ప్రజలను చైత్యనవంతులను చేసి తెలంగాణ సాధన దిశగా ముందుకు సాగుతామన్నారు. కత్తి ఒకరికి ఇచ్చి మరొకరిని యుద్ధం చేయమనడం కాదన్న విషయాన్ని ప్రజలకు తెలియచేస్తామని చెప్పారు. కాంగ్రెస్‌, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలను తెలంగాణ నుంచి తరిమినప్పుడే తెలంగాణ సాధ్యమన్న విషయాన్ని తెలంగాణ వాస్తవంగా ప్రచారం చేస్తామని తెలిపారు. ఈ నెల 15న చేవెళ్లలో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డితో పాటు పలువురు కూడా పార్టీ తీర్థం పుచ్చుకుంటారని, ఈ నెల 23న సూర్యాపేట బహిరంగ సభ ద్వారా తెలంగాణ సత్తాను ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేసారు. నవంబర్‌ 30 నుంచి జనవరి 10 వరకు నిర్వహించే పల్లెబాట కార్యక్రమంలో పల్లెపల్లెకు తిరిగి కాంగ్రెస్‌ మోసాన్ని, వచ్చిన తెలంగాణను టీడీపీ అడ్డుకున్న వైనాన్ని ప్రజలకు వివరించాలని, తద్వారా ప్రజలను ఉద్యమం బాట పట్టించాలని ఈ సమావేశం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. జనవరి 10 తరువాత కేసీఆర్‌, ప్రజా ప్రతినిధులు బస్సు యాత్ర నిర్వహించాలని, ప్రతి మండలాన్ని కలియచుట్టాలని నిర్ణయించారు. మరో ఆరు నెలల్లో మధ్యంతరం ఉంటుందని భావిస్తున్న కేసీఆర్‌ అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంతోపాటు పార్టీని పటిష్టంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు పెంచాలని, తుఫాన్‌ కారణంగా పంట నష్టపోయిన రైతులకు యుద్ధప్రాతిపదికన పరిహారం అందజేయాలని, కాకతీయ ఉత్సవాలకు రూ.150 కోట్లు మంజూరు చేయాలని సదస్సులో తీర్మానించినట్లు ఆయన తెలిపారు.