ఇక సమరమే

28న భవిష్యత్‌ కార్యాచరణ  ప్రకటిస్తాం
టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌
హైదరాబాద్‌, జనవరి 25 (జనంసాక్షి):
హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుంచి ప్రారంభ మయ్యే 36 గంటల సమర దీక్షను పెద్ద ఎత్తున విజయ వంతం చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపుని చ్చారు. శుక్రవారం జేఏసీ కార్యాలయంలో సమర దీక్షకు సంబంధించి తెలంగాణ న్యాయ వాదుల జేఏసీ తెలంగాణ ఎంఆర్‌పీఎస్‌   రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం  ఈనెల 28లోపు తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయకపోతే 28న భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని ఈసారి  ఉద్యమం తీవ్రస్థాయిలో ఉంటుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు అధిష్టానంపై ఒత్తిడి తేవడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ప్రకటన చేయించండి లేదంటే ఉద్యమంలోకైనా రావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రం తెలంగాణ ప్రజలను వంచించేందుకు, మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నదని, 1956 నుంచి మోసం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీని టార్గెట్‌గా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళతామని ఆయన స్పష్టం చేశారు. సమర దీక్షను విజయవంతం చేసేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేశామని, ఆ దీక్షను పెద్ద ఎత్తున విజయవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. తెలంగాణ ఉద్యోగ సంఘ నాయకులు దేవీ ప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ జేఏసీ పిలుపునిస్తే వంద రోజులే కాదు ఎన్ని రోజులైనా సమ్మెకు తాము సిద్ధమని ప్రకటించారు. ఈసారి సాధించేవరకు పట్టువీడేదిలేదని ప్రకటించారు.