ఇజ్రాయెల్‌కు ‘హిజ్బుల్లా’ కొరకరాని కొయ్య
లక్షకుపైగా రాకెట్లు, క్షిపణులు ఆ సంస్థ సొంతం
ఇజ్రాయోల్ నిఘా విభాగం మోసాద్ అంచనా
గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన హిజ్బుల్లా
హమాస్‌తో పోలిస్తే అన్నింట్లోనూ బలీయమైన శక్తి
గాజాపై వెంటనే దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరిక
పాలస్తీనాపై విరుచుకుపడుతూ మారణహోమం సృష్టిస్తున్న ఇజ్రాయెల్‌కు మరో పెనుసవాల్ ఎదురుకానుందా? హమాస్ కంటే అత్యంత ప్రమాదకారితో తలపడాల్సి వస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది. అత్యంత ఆయుధ సంపత్తి, క్రియాశీల బలగాలున్న హిజ్బూల్లాను ఇజ్రాయెల్ ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ అండదండలతో అత్యంత బలీయమైన సంస్థగా ఎదిగిన హిజ్బుల్లా.. తన అమ్ముల పొదిలో అనేక అస్త్రాలను పోగుచేసుకున్నట్టు ఇజ్రాయెల్ నిఘా వర్గాలు భావిస్తున్నాయి. లెబనాన్‌లోని షియా వర్గానికి చెందిన ఈ సంస్థతో గతంలో ఇజ్రాయెల్ యుద్ధానికి దిగినప్పటికీ పూర్తిస్థాయిలో కట్టడి చేయలేకపోయింది. ప్రస్తుతం యుద్ధ పరిస్థితులే తలెత్తితే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోననే ఆందోళన నెలకొంది.
బీరూట్, అక్టోబర్ 14 (జనంసాక్షి)
హిజ్బుల్లా వద్ద ప్రస్తుతం లక్షకు పైగా రాకెట్లు ఉన్నాయని ఇజ్రాయెల్ నిఘావర్గాల అంచనా. ఆర్థికంగా, ఆయుధపరంగానూ ఈ సంస్థకు ఇరాన్ సాయం చేస్తోంది. ఈ సంస్థ లక్ష్యం సైతం ఇజ్రాయెల్‌ను తొలగించి పాలస్తీనా స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడమే కావడంతో.. హమాస్ ఉగ్రదాడి అనంతరం కొన్ని రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై ప్రయోగించింది. దీనికి స్పందనగా ఇజ్రాయెల్ వీరి స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. 1980ల్లో లెబనాన్‌లో ఏర్పడిన ఈ సంస్థ రాజకీయంగానూ, మిలటరీపరంగానూ బలోపేతంగా ఉంది. ఈ సంస్థ దగ్గర ఇప్పటికే లక్షకుపైగా రాకెట్లు ఉన్నట్టు సమాచారం. వీటితోపాటు స్వల్పలక్ష్యాలను ఛేదించే క్షిపణులు సైతం ఉన్నట్టు తెలుస్తోంది. హమాస్ మిలిటెంట్లతో పోలిస్తే వీరి సంఖ్య అధికంగా ఉంది. దాదాపు లక్షకుపై క్రియాశీల బలగాలు ఉన్నట్టు పాశ్చాత్య నిఘావర్గాలు పేర్కొన్నాయి.1985, 2000, 2006ల్లో ఇజ్రాయెల్ దళాలు, హిజ్బుల్లా మధ్య ఘర్షణలు జరిగాయి. సిరియా అంతర్యుద్ధంలో రష్యా, ఇరాన్ దళాలతో పాటు వీరి ప్రవేశంతో సిరియా పాలకులు ఆ దేశ తిరుగుబాట్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. 2006లో ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య దాదాపు 34 రోజుల పాటు యుద్ధం జరిగింది. అనంతరం ఇరువర్గాల మధ్య ఒప్పందం కుదరడంతో ఇజ్రాయెల్ దళాలు వెనక్కు మళ్లాయి. అయితే ఈ యుద్ధం తరువాత హిజ్బుల్లా ఆయుధ పాటవం గణనీయంగా పెరగడం గమనార్హం.
గెరిల్లా యుద్ధంలో ఆరితేరిన హిజ్బుల్లా
హమాస్, హిజ్బుల్లా తదితర సంస్థలు ఆయా దేశ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం వహించవు. అయితే గెరిల్లా యుద్ధంలో ఆరితేరాయి. యుద్ధరంగంలో ఎదురుగా నిలబడిన శత్రువుతో ముఖాముఖి పోరాటం ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అయితే గెరిల్లా యుద్ధంలో ఇలా ఉండదు. సాధ్యమైనంత తక్కువ ప్రాణనష్టంతో వైరిపక్షానికి తీవ్రనష్టం కలిగిస్తాయి. ఇజ్రాయెల్ దళాలు సుశిక్షితమైనవి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ గెరిల్లా యుద్ధంలో సందర్భానుసారంగా వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది. గతంలో హమాస్, హిజ్బుల్లా ఉగ్రసంస్థలపై ఇజ్రాయెల్ దాడులు చేసినా పూర్తిగా నిర్మూలించలేకపోయింది. రానున్న కాలంలో హిజ్బుల్లాతో తలపడితే ఎలాంటి వ్యూహాలను ఇజ్రాయెల్ సైన్యం ఎలా అమలుచేస్తుందో చూడాలి. మరోవైపు గాజాపై దాడులు ఆపాలని, హిజ్బుల్లా రంగంలోకి దిగితే ఇజ్రాయెల్‌లో భూమి కంపిస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్ హెచ్చరించారు.