ఇటలీలో భారీ భూకంపం

index21కి చేరిన మృతులు

రోమ్‌: ఇటలీ దేశాన్ని భారీ భూకంపం కుదిపేసింది. బుధవారం తెల్లవారుజామున దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ భూప్రకంపనలు సంభవించాయి. మృతుల సంఖ్య ఇప్పటివరకు 21కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. పెరుగియా నగరానికి 76 కి.మీల దూరంలో ఉన్న రీటి ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటికి పరుగులు తీశారు.ఇటలీ రాజధాని రోమ్‌లోనూ 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలాయి. ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందగా.. వీరిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు శిథిలాల నుంచి బయటికి తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

భూకంపం ధాటికి ఎమాట్రిస్‌ నగరం పూర్తిగా ధ్వంసమైందని నగర మేయర్‌ సర్జియో పిరోజీ తెలిపారు. నగరం నడిబొడ్డున భారీ భవనాలు కుప్పకూలిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినట్లుస్థానికులు తెలిపారు. భూకంప తీవ్రతను ముందుగా గుర్తించే యూఎస్‌జీఎస్‌ పేజర్‌ సిస్టమ్‌ ఇటలీలో రెడ్‌అలర్ట్‌ ప్రకటించింది. 2009లో ఇటలీలోని అకీలా ప్రాంతంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ ఘటనలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు.