ఇడి విచారణకు హాజరైన సోనియా
తోడుగా వచ్చిన రాహుల్,ప్రియాంకలు
విచారణకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళనలు
రాష్ట్రపతి భవన్‌వైపు వెళ్లేందుకు యత్నం
రాహుల్ సహాపలువురు ఎంపిల అరెస్ట్
ఎఐసిసి కార్యాలయం వద్ద మహిళానేతల ఆందోళన
ఇడిని దుర్వినియోగంపై రాష్ట్రపతి ముర్ముకు విపక్షాల లేఖ
న్యూఢల్లీి,జూలై26(జనంసాక్షి): నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం మరోసారి ఈడీ విచారణకు హాజరయ్యారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై సోనియాను ఈడీ ప్రశ్నించనుంది. సోనియాకు తోడుగా ఆమె కుమారుడు రాహుల్ గాంధీ,ప్రియాంకలు కూడా ఈడీ కార్యాలయం వరకు వచ్చారు. మరోవైపు సోనియాపై ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మహిళా కార్యకర్తలు నల్ల బెలూన్లు చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈడీ అధికార దుర్వియోగాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు భాజపా భయపడే ఈడీని పంపిస్తోందని పేర్కొన్నారు. ఇదిలావుంటే సోనియా గాంధీ
విచారణ నేపథ్యంలో కాంగ్రెస్‌నేతలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో రాహుల్ సహా 17 మంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం, పార్లమెంటు ఆవరణల్లో ఈ నిరసనలు జరుగుతున్నాయి. ఖర్గే, కేటీఎస్ తుల్సీ, చిదంబరం, వివేక్ తన్ఖా వంటి సీనియర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈడీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని.. దీనిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికే ఓసారి ఈడీ సోనియాను విచారించింది. ఈనెల 21న జరిగిన
విచారణలో సోనియాను ఈడీ సుమారు 25 ప్రశ్నలు అడిగింది. అయితే సోనియా చేసిన విజ్ఞప్తి కారణంగా విచారణను రెండు గంటల్లో ముగించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. పలు చోట్ల నిరసనలు ఉద్ధృతంగా మారాయి. నిరసనకారులను నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, కాంగ్రెస్ ఎంపీలను నిర్బంధించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ఆపాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. విజయ్ చౌక్ వద్ద బైఠాయించిన రాహుల్ గాంధీతో పాటు ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ గాంధీని పార్లమెంట్ స్ట్రీట్ లోని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సోనియా గాంధీ ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్తంగా మహాత్మాగాంధీ విగ్రహల దగ్గర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఢల్లీిలోని కాంగ్రెస్ కార్యాలయం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు ఢల్లీి పోలీసులు అనుమతి నిరాకరించారు. సోనియా గాంధీ నివాసం 10 జనపథ్ పక్కనే ఉన్న కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని ఆ పార్టీ సీనియర్లు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సోనియా గాంధీ ఈడీ విచారణ నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈడీ విచారణను నిరసిస్తూ దేశవ్యాప్త ప్రదర్శనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈడీ విచారణ సందర్భంగా ఏఐసీసీ వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరాకుండా అక్బర్ రోడ్‌లో 3 వరుసలుగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఆందోళనలు ఉధృతంగా కాకుండా వాటర్ కెనాన్లను పోలీసులు సిద్ధంగా ఉంచారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ ఆంక్షలు విధించారు. కాంగ్రెస్ కార్యకర్తలు గుమికూడకుండా నిషేధాజ్ఞలు విధించారు. ఢల్లీి పోలీసుల అనుమతితో తాము నిరసన తెలుపుతున్నామని లోక్ సభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే చెప్పారు. ప్రతిపక్షాల పూర్తిగా అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, తమ గొంతులను మూయించేందుకు ప్రయత్నిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కుట్రలకు తాము భయపడబోమని, తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్టేట్ర్ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది. నేషనల్ హెరాల్డ్ కేసులో
కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. సోనియా వెంట ఆమె కూతురు ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. భారీ బందోబస్తు మధ్య సోనియాగాంధీ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నగదు అక్రమ చలామణికి సంబంధించిన కేసులో దర్యాప్తు సంస్థ ఈడీ సోనియాను ప్రశ్నించడం ఇది రెండోసారి. కాంగ్రెస్ పై కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విపక్షాలు లేఖ రాశాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందని లేఖలో ఆరోపించాయి.రాజకీయ
ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐలతో కేంద్రం వేధిస్తోందని, ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఫిర్యాదు చేశాయి. నిత్యావసర సరుకులపై జీఎస్టీ విధించటంపై పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా లేదని, నిత్యావసర ధరల పెరుగుదలపై ప్రత్యేకంగా చర్చ జరిపేలా చూడాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును విపక్షాలు లేఖలో కోరాయి.