ఇదొ తరహా కుట్ర : జోగు రామన్న
ఆదిలాబాద్‌్, జూలై 30: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వకుండా రాయలసీమ నాయకులతో విభిన్న ప్రకటనలు చేయించడం చంద్రబాబు కుట్ర అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆరోపించారు. తెలంగాణపై లేఖ ఇచ్చే ముందు రాయలసీమ ప్రజల ఆకాంక్షను గుర్తించాలంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే, రాయలసీమ పరిరక్షణ సమితి నాయకులు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేసిన ప్రకటన వెనుక చంద్రబాబు హస్తం ఉందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలమని ఈ విషయమై త్వరలో చిదరంబరానికి చంద్రబాబుతో లేఖ ఇప్పిస్తామని ప్రకటించిన తెలంగాణ ఫోరం నేతలు ప్రజలకు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతలతో టీడీపీ డ్రామాలు ఆడిస్తున్న టీడీపీ తెలంగాణ నేతలు వారిని అడ్డుకోవడం లేదని ఆరోపించారు. తెలుగుదేశం నేత ప్రకటను ప్రజలు నమ్మేస్థితిలో లేరని తెలంగాణ ప్రాంతంలో ఆ పార్టీకి స్థానం లేదని అన్నారు.