ఇద్దరు స్పెషలిస్టు వికెట్‌ కీపర్లు అవసరం

– భారత మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరే
న్యూఢిల్లీ, జులై18(జ‌నం సాక్షి) : ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు భారత్‌ ఇద్దరు స్పెషలిస్టు వికెట్‌ కీపర్లను ఎంచుకోవాలని భారత మాజీ వికెట్‌ కీపర్‌ కిరణ్‌ మోరే సూచించారు. ఆగస్టు 1 నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెలక్టర్లు బుధవారం ఇంగ్లాండ్‌తో తలపడే భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా కిరణ్‌ మాట్లాడుతూ.. ‘ఆతిథ్య ఇంగ్లాండ్‌తో భారత్‌ ఐదు టెస్టు మ్యాచ్‌లతో సుదీర్ఘ సిరీస్‌ ఆడనుంది. దీంతో భారత్‌ తప్పనిసరిగా ఇద్దరు స్పెషలిస్టు వికెట్‌కీపర్లను ఎంచుకోవాలని, ఎందుకంటే సిరీస్‌ మధ్యలో ఎవరైనా గాయపడినా, అనుకోకుండా అనారోగ్య సమస్యల పాలైనా మరొకరు అందుబాటులో ఉంటారని మోరే పేర్కొన్నారు. ఇంగ్లాండ్‌పై వన్డే, టీ20 సిరీస్‌ల్లో దినేశ్‌కార్తీక్‌ బాగానే బ్యాటింగ్‌ చేశాడు. అతను అనుభవం ఉన్న ఆటగాడు కూడా. ఒకవేళ సాహా అందుబాటులో లేకపోతే దినేశ్‌ కార్తీక్‌, పార్దివ్‌ పటేల్‌ను తీసుకోవాలని, వీరిని నాలుగు లేదా ఐదు స్థానాల్లో ఆడించాలన్నారు. ఇన్నింగ్స్‌ ఓపెనర్‌ కావాలంటే పార్దివ్‌ను ఓపెనర్‌గా కూడా పంపొచ్చునని, ఇందుకోసం వారి దేశవాళీ క్రికెట్‌ రికార్డులను ఒకసారి పరిశీలించండని మోరే సూచించారు. దక్షిణాఫ్రికాతో ఒక మ్యాచ్‌లో పార్దివ్‌ సరిగా ఆడలేదని అతన్ని ఎంపిక చేయకపోవడం సరికాదని కిరణ్‌ అన్నారు. ఈ సిరీస్‌లో ఎవరు గెలుస్తారని ముందు చెప్పడం చాలా కష్టమని, మ్యాచ్‌ ఫలితాలన్ని పిచ్‌లపై ఆధారపడి ఉన్నాయన్నారు. బంతి బాగా తిరుగుతుంది అనుకుంటే ఇద్దరు సిన్నర్లతో ఆడాలన్నారు. లీడ్స్‌ లాంటి మైదానంలో ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగితే సరిపోతుందన్నారు. దక్షిణాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లాండ్‌లో పిచ్‌లు పేసర్లకు అనుకూలిస్తాయని, ఇరు జట్లకు ఈ సిరీస్‌ సవాలుతో కూడుకున్నదన్నారు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాలో టీమిండియా మెరుగైన ప్రదర్శన చేసిందని, ఇలాంటి ప్రదర్శనను పునరావృతం
చేస్తే మంచి ఫలితాలు రాబట్టొచ్చు అని కిరణ్‌ వివరించారు.