ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వో రంగనాథ్‌ రాజీనామా

న్యూఢిల్లీ, ఆగస్టు18(జ‌నం సాక్షి) : దేశీయ రెండో దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ నుంచి మరో సీనియర్‌ అధికారి వైదొలిగారు. కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌(సీఎఫ్‌వో) రంగనాథ్‌ తన పదవికి రాజీనామా చేశారు. 18ఏళ్ల పాటు ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న రంగనాథ్‌ కొత్త విషయాల్లో వృత్తిపరమైన అవకాశాల దృష్ట్యా తన బాధ్యతల నుంచి వైదొలిగినట్లు కంపెనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది నవంబరు 16 వరకు రంగనాథ్‌ సీఎఫ్‌వో పదవిలో కొనసాగుతారు. ఆతర్వాత కొత్త సీఎఫ్‌వో కోసం ఇన్ఫోసిస్‌ బోర్డు ఇప్పటికే వేట మొదలుపెట్టింది. గతంతో సీఎఫ్‌వోగా పనిచేసిన రాజీవ్‌ బన్సాల్‌ రాజీనామా చేయడంతో 2015లో రంగనాథ్‌ ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇన్ఫోసిస్‌లో 18ఏళ్ల విజయవంతమైన కెరీర్‌ తర్వాత కొత్త విషయాల్లో వృత్తిపరమైన అవకాశాల కోసం నేను సిద్ధమయ్యానని అన్నారు. గత మూడేళ్లలో కంపెనీకి ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయని, అయినప్పటికీ వాటిని అధిగమించి మేం ఉత్తమ ఆర్థిక ఫలితాలను సాధించామని చెప్పేందుకు గర్వపడుతున్నా అని అన్నారు. రంగనాథ్‌ రాజీనామాపై ఇన్ఫోసిస్‌ బోర్డు ఛైర్మన్‌ నందన్‌ నీలేకని స్పందించారు.. గత 18ఏళ్లలో రంగనాథ్‌ కంపెనీలో ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారన్నారు. కంపెనీ విజయాల్లో భాగమయ్యారని, ఈ సుదీర్ఘ కాలంలో ఆయనలోని విస్తృత నాయకత్వ లక్షణాలను చూశానని నీలేకని అన్నారు.
—————————-