ఇన్‌చార్జి మంత్రులను మార్చడంతో అభివృద్ధి వెనకంజ
ఆదిలాబాద్, జూలై 7 : జిల్లా ఇన్‌చార్జి మంత్రిని తరచుగా మార్చడం వల్ల జిల్లా అభివృద్ధితో పాటు మరికొన్ని సమస్యలు పరిష్కరించకుండా ఉన్నాయని సర్వత్రా వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇన్‌చార్జి మంత్రులను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మారుస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి సారయ్యను యథావిధిగా కొనసాగించాలని కాంగ్రెస్ నేతలతో పాటు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదివరకే ఇద్దరు ఇన్‌చార్జి మంత్రులను మార్చడంతో కొత్తగా వచ్చే ఇన్‌చార్జి మంత్రులకు జిల్లాపై అవగాహన కలిగేందుకు కొన్ని నెలలు పడుతున్నందున జిల్లా సమస్యలు పరిష్కారం కాకుండా పోతున్నాయి. తాజాగా ఇన్‌చార్జి మంత్రి సారయ్యను మారుస్తారన్న ప్రచారం జరుగుతుండడంతో జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిని కలిసి సారయ్యనే కొనసాగించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. రాష్ట్రంలో మంత్రి పదవి లేని అదిలాబాద్ జిల్లా ఒక్కటే ఉండడంతో ఆపైన జిల్లా ఇన్‌చార్జి మంత్రులను తరచుగా మారుస్తుండడంతో ప్రజలకు అనేక సమస్యలు వెంటాడుతున్నాయి. 2009లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దానం నాగేందర్‌ను ఇన్‌చార్జి మంత్రిగా నియమించారు. అనంతరం రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు. అనంతరం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో బసవరాజు సారయ్యను నియమించారు. జిల్లా ప్రతినిధిగా ఉండడం, సమస్యలు అనేకంగా ఉండడం, జిల్లాపై అవగాహనకు రావడానికి కొత్తవారికి నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి ఇన్‌చార్జి మంత్రి సారయ్యకు జిల్లాపై అవగాహన పెరిగి ఇప్పుడిప్పుడే సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్న సమయంలో మరోసారి జిల్లా ఇన్‌చార్జి మంత్రిని మారుస్తారని వస్తున్న వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జిల్లాకు మంత్రి పదవైనా కేటాయించాలని, జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా సారయ్యను కొనసాగించాలని కాంగ్రెస్ శ్రేణులు విజ్ఞప్తి చేస్తున్నాయి.