ఇమ్రాన్‌ ఖాన్‌ గెలుపు దేశానికే కళంకం

– దేశరాజకీయాలపై ఈ విజయం చెడు ప్రభావం చూపుతుంది
– మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌
ఇస్లామాబాద్‌, జులై27(జ‌నం సాక్షి) : పాకిస్థాన్‌ ఎన్నికల్లో పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ విజయం దేశానికే కళంకం అని మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ అన్నారు. దేశ రాజకీయాలపై ఇది చెడు ప్రభావం చూపుతుందని షరీఫ్‌ హెచ్చరించారు. అడియాలా జైలులో శిక్ష అనుభవిస్తున్న షరీఫ్‌ను కలుసుకునేందుకు గురువారం సాయంత్రం పీఎంఎల్‌ఎన్‌ నేతలు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాక్‌ ఎన్నికల ఫలితాల గురించి ఆరా తీశారు. పలు నియోజకవర్గాల్లో పీఎంఎల్‌ఎన్‌ నేతలు ఘోర పరాజయం పొందారని, ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పార్టీ నేతలు ఘన విజయం సాధించినట్లు షరీఫ్‌కు వారు తెలియజేశారు. పీఎంఎల్‌ఎన్‌ నేతలకు మంచి పట్టు ఉన్న ఫైసలాబాద్‌, లా¬ర్‌, రావల్పిండి ప్రాంతాల్లో ఆ పార్టీ నేతలు ఓడిపోయి ఇమ్రాన్‌ ఖాన్‌ అభ్యర్థులు గెలవడంపై ఆయన విమర్శలు చేశారు. 2013 సార్వత్రిక ఎన్నికల్లో ఖాన్‌ పార్టీ పేలవ ప్రదర్శన కనబరిచి, ఇప్పుడు అఖండ విజయం సాధించడం
నమ్మశక్యంగా లేదని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు దేశానికే కళంకమని, ఖాన్‌ గెలవడం దేశ రాజకీయాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని ఆయన తెలిపారు. ప్రతి గురువారం అడియాలా జైలులో షరీఫ్‌ను కలుసుకునేందుకు నేతలకు అనుమతి ఉంటుంది. ఆ రోజే షరీఫ్‌, ఆయన కుమార్తె కలుసుకుంటారు. షరీఫ్‌ ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు ఆయన ఫిజీషియన్‌ కూడా జైలుకు వెళ్లారు. షరీఫ్‌ ఆరోగ్యం సరిగా లేదని ఈ సందర్భంగా నేతలు చెప్పారు. షరీఫ్‌కు జైలులో ఎటువంటి ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయలేదని చెప్పుకొచ్చారు. అవినీతి కేసులో దోషిగా తేలిన షరీఫ్‌కు పదేళ్ల జైలు, ఆయన కుమార్తె మరియంకు ఏడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.