ఇమ్రాన్‌ ప్రమాణ స్వీకారానికి వెళ్తా 

– ఆయన నమ్మకస్తుడని పంజాబ్‌ మంత్రి సిద్ధూ ప్రశంస
చండీగఢ్‌, ఆగస్టు 2(జ‌నం సాక్షి) : మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్సాఫ్‌ పార్టీ అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి తాను హాజరవుతానని మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ కేబినెట్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ వెల్లడించారు. ఆగస్టు 11న ఇమ్రాన్‌ఖాన్‌ పాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్ననేపథ్యంలో ఆయన భారత లెజండరీ క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. మాజీ క్రికెటర్లు సునీల్‌ గావస్కర్‌, కపిల్‌ దేవ్‌, నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూలతో పాటు బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ఖాన్‌కు కూడా ఇమ్రాన్‌ ఆహ్వానం పంపించారు. తాను ఇమ్రాన్‌ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నానని, కార్యక్రమానికి తప్పకుండా హాజరుతానని సిద్ధూ తెలిపారు. ఇమ్రాన్‌ ఖాన్‌ కెప్టెన్సీలోనే పాకిస్థాన్‌కు ప్రపంచ కప్పు లభించిందని, ఆయన నమ్మదగిన వ్యక్తి అని సిద్ధూ ప్రశంసించారు. తనకు ఆహ్వానం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఖాన్‌ సాహెబ్‌ వ్యక్తిత్వమున్న మనిషి అని, నమ్మకస్తుడు అని సిద్ధూ కితాబిచ్చారు. క్రీడాకారులు అడ్డుగోడలను తొలగించి వంతెనలను నిర్మిస్తారని, ప్రజలను ఐక్యం చేస్తారని సిద్ధూ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 269 స్థానాల్లో ఇమ్రాన్‌ ఖాన్‌ పీటీఐ పార్టీ 115 సీట్లు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే.