ఇసుక అక్రమరవాణాతో కార్మికులకు నష్టం
పనులు దొరక్క ఆందోళన: సిఐటియు
విజయవాడ,డిసెంబర్18 (జనంసాక్షి): ఇసుక దొరక్క పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతుంటే కొందరు ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకుని అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని సీఐటీయూ నేతలు అన్నారు. కార్మికులు కుటుంబాల పోషణ భారమై అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మరికొంత మంది వలసలు పోతున్నారన్నారన్నారు. అడ్డాల ఏర్పాటు, ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాల్సిన కార్మిక శాఖ అధికారులు చోద్యం చేస్తున్నారని విమర్శించారు. ఇసుక పాలసీపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. భవననిర్మాణ రంగం కార్మికుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సెస్ ద్వారా సంక్షేమ బోర్డులో ఉన్న నిధులు కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయకుండా ఇతర రంగాలకు మళ్లిం చడం సరికాదన్నారు. ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించొద్దన్నారు. సిమెంట్, ఐరన్, రంగులు, ఇతర ముడి సరుకుల ధరలు నియంత్రించి వాటిని ప్రభుత్వ మే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం లో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు 18 రకాల విభాగాల్లో పని చేస్తున్నారని తెలిపారు. అందులో 8 లక్షల మంది కార్మికుల పేర్లు మాత్రమే సంక్షేమ బోర్డులో నమోదై ఉన్నాయని చెప్పారు. పెట్టుబడిదారులు, బడా వ్యాపారులకు రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం కార్మికులకు మాత్రం కూలి పెంపు, రుణాలివ్వడం లేదన్నారు.