ఈసారైనా నెగ్గేనా!

– నేటి నుంచి భారత్‌-ఇంగ్లాండ్‌ మూడో టెస్టు
– రెండు టెస్టుల విజయంతో ఆత్మవిశ్వాసంతో ఇంగ్లాండ్‌
– ఓటమినుంచి బయటపడేలా టీమిండియా కసరత్తు
– తుదిజట్టు కూర్పుపై ప్రత్యేక దృష్టి
– భారీ మార్పులతో బరిలోకి టీమిండియా?
నాటింగ్‌మ్‌, ఆగస్టు17(జ‌నం సాక్షి ) : ఇంగ్లండ్‌ గడ్డపై వరుస ఓటములతో విమర్శల పాలువుతున్న టీమిండియా మూడో టెస్ట్‌ కోసం సిద్ధమవుతోంది.. ట్రెంట్‌ బ్రిడ్జ్‌ లో మూడో టెస్ట్‌ జరగనుంది. ఈ టెస్ట్‌ లోనైనా గాడిలో పడాలని చూస్తోంది. ఇప్పటికే రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా ఈ మ్యాచ్‌ లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. లార్డ్స్‌ టెస్ట్‌ లో అనుహ్య మార్పులతో దెబ్బతిన్న టీమిండియా.. ఈ మ్యాచ్‌ లో మాత్రం జట్టుకూర్పుపై ప్రత్యేక శ్రద్దపెడుతోంది. భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. ఆతిథ్య ఇంగ్లండ్‌ మాత్రం విన్నింగ్‌ టీమ్‌ తోనే మూడో టెస్టుకు సిద్ధమవుతోంది. రెండు వరుస ఓటములతో టీమిండియా ఒత్తిడిలో పడింది. అన్ని విభాగాల్లో ఆటగాళ్ల వైఫల్యం జట్టుపై గట్టి ప్రభావం చూపుతోంది. రెండో టెస్ట్‌ లో గాయపడ్డ కెప్టెన్‌ కోహ్లీ కోలుకున్నాడు. మూడో టెస్ట్‌ బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నాడు. వరుసగా విఫలం అవుతున్న కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌ ప్లేస్‌లో యంగ్‌ రిషభ్‌ పంత్‌ టెస్ట్‌ అరంగేట్రం పక్కాగా మారింది. ఇక మిడిలార్డర్‌ లో కరుణ్‌ నాయర్‌ కు సైతం అవకాశం దక్కొచ్చు. మరో వైపు గాయంతో రెండు టెస్టులకు దూరమైన బూమ్రా రీఎంట్రీ ఇస్తున్నాడు. అటు ఉమేశ్‌ యాదవ్‌ సైతం తుదిజట్టులోకి రానున్నాడు. లార్డ్స్‌ లో టెస్ట్‌ లో విఫలమైన కుల్దీప్‌ మళ్లీ రిజర్వ్‌ బెంచ్‌కు పరిమితం ఖాయం. స్పిన్‌ బాధ్యతలను అశ్విన్‌ మోయనున్నాడు.
విజయం జోష్‌లో ఇంగ్లాండ్‌..
మరోవైపు  సొంతగడ్డపై ఎదురులేకుండా దూసుకుపోతున్న ఇంగ్లండ్‌.. విక్టరీ జోష్‌ లో ఉంది. బెన్‌ స్టోక్స్‌ ప్లేస్‌ లో టీమ్‌ లో వచ్చిన ఓక్స్‌.. లార్డ్స్‌ టెస్ట్‌ లో అలరించాడు.. సూపర్‌ సెంచరీతో పాటు బౌలింగ్‌ లోనూ అధ్భుతంగా రాణించాడు. అటు పేస్‌ ధ్వయం అండర్సన్‌, బ్రాడ్‌ లు సైతం బంతితో రాణిస్తున్నారు. ఇక స్పిన్‌ విభాగంలో రషీద్‌ సైతం కీలకంగా మారుతున్నాడు. ఇక బ్యాటింగ్‌ లో మాత్రం వెటరన్‌ కుక్‌ మాత్రం ఫామ్‌ లేమితో తంటాలుపడుతున్నాడు. అయితే లాంగ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉన్న ఇంగ్లండ్‌ కు భారీ స్కోర్లు పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. కెప్టెన్‌ రూట్‌ తో పాటు బెయిర్‌ స్టో సూపర్‌ ఫామ్‌ తో ఇంగ్లండ్‌ మరో విజయంపై గట్టి నమ్మకంతో ఉంది. ట్రెంట్‌ బ్రిడ్జ్‌ లో టీమిండియాకు మంచి రికార్డే ఉంది. ఈ గ్రౌండ్‌ లో టీమిండియా ఆరు మ్యాచ్‌ లాడి ఒకే మ్యాచ్‌ లో విజయం సాధించింది.  మరో మూడు మ్యాచ్‌ లను డ్రా చేసుకుంది. ఇక ఇంగ్లండ్‌ రెండు మ్యాచ్‌ ల్లో విజయం సాధించింది. ఈ గ్రౌండ్‌ లో టీమిండియా
చివరిసారిగా 2007 లో ఇంగ్లండ్‌ ను ఓడించింది. 2014లో సిరీస్‌ లో జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.
ఈ సిరీస్‌ లో టీమిండియా-ఇంగ్లండ్‌ మధ్య తేడా బ్యాటింగ్‌ వైఫల్యమే. ఈ మ్యాచ్‌ లోనైనా టీమిండియా బ్యాటింగ్‌ మెరుగుపడకపోతే మరోసారి పరాభవం తప్పకపోవచ్చు. అయితే ఈ గ్రౌండ్‌ లో ఓపెనర్‌ విజయ్‌ కు మంచి రికార్డుంది. వరుసగా విఫలం అవుతున్న విజయ్‌ ఈ మ్యాచ్‌ లో గాడిలో పడితే టీమిండియా కష్టాలు సగం తీరినట్లే. బ్యాటింగ్‌ కు అనుకులించే ట్రెంట్‌ బ్రిడ్జ్‌ పిచ్‌ పై టాస్‌ మరోసారి కీలకం కానుంది.