ఈ నెల 24న దీపావళి పండుగ

సూర్యాపేట బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చకిలం రాజేశ్వర రావు

సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):ఈ నెల 23న ధన త్రయోదశి, 24న దీపావళి పండుగ జరుపుకోవాలని సూర్యాపేట జిల్లా బ్రాహ్మణ సేవా సమాజం సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.వివిధ వర్గాల ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తి మేరకు, ప్రజలలో ఉన్న అయోమయంను నివృత్తి చేసేందుకు, పురోహిత బ్రాహ్మణ సంఘ ముఖ్యులు సమావేశమై, దీపావళి పండుగ జరుపుకునే తేదీలను బ్రాహ్మణ సేవా సమాజం అధ్యక్షులు చకిలం రాజేశ్వర రావు,పురోహిత సంఘాల నాయకులు శ్రీరామకవచం నాగయ్య శాస్త్రి , పులి హరిప్రసాద్ శర్మ , మంత్రమూర్తి లక్ష్మణ శర్మ , కిశోర్ శర్మ తదితరులు చర్చించి పండుగ తేదీలను ఖరారు చేయడం జరిగింది.ఈ నెల 24న సోమవారం ఉదయత్పూర్వం చతుర్థశి తిథి కావున తెల్లవారుజామున 4 నుండి 6.30 గంటల వరకు మంగళ హారతులు, తైలం అభ్యంగన స్నానాలు ఆచరించాలని తెలిపారు.సాయంత్ర సమయంలో తిథి అమావాస్య ఉంటుంది కాబట్టి సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి వరకు ధనలక్ష్మీ పూజలు చేసుకోవచ్చునని తెలిపారు.25వ తేదీ మంగళవారం సూర్యగ్రహణం కారణంగా కేదారేశ్వర వ్రతాలు చేసుకోరాదని చెప్పారు.26వ తేదీ బుధవారం స్వాతీ నక్షత్రం ఉన్నందున ఆ రోజు నుండి కేదారేశ్వరి వ్రతాలు జరుపుకోవచ్చని తెలియజేశారు.ఈ తేదీలను ఖరారు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పండితుల సలహాలను సూచనలను కూడా పరిగణలోకి తీసుకుని, పంచాంగాలను సమగ్రంగా పరిశీలించి, శాస్త్రోక్తంగా ఈ దీపావళి పండుగ, మంగళహారతులు,లక్ష్మీ పూజలు, కేదారేశ్వర వ్రతాలు తేదీలను నిర్ణయించడం జరిగిందనీ, ప్రజలు నిరభ్యంతరంగా నిస్సంకోచంగా పై తేదీలను ఆచరించి పండుగను వైభవంగా నిర్వహించుకోవచ్చని తెలిపారు.