ఈ బడ్జెట్‌లోనూ ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయమే : తెదేపా

న్యూఢిల్లీ : ఇప్పటికే పనులు నడుస్తున్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని తెలుగుదేశం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. బన్సల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఆయన విలేకరులతో మాట్లాడుతూ గత బడ్జెట్‌లో కేటాయించిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వ ప్రదర్శిస్తోందన్నారు. కిందటి బడ్జెట్‌లో 1000 కి.మీ. రైల్వే లైన్లు వేస్తామని చెప్పి ప్రస్తుతం దానిని 750 కి.మీ కుదించడం ఏమిటని ప్రశ్నించారు.
ఆర్థిక బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు సర్వే చేస్తారు. రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడు ఎందుకు సర్వే చేయడం లేదని నరసరావు పేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు. గత బడ్జెట్‌లో కేటాయించిన పనులే పూర్తి కాలేదని, ఇప్పుడు కొత్త వాటిని కేటాయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
బన్సల్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ కేవలం అమేధి- రాయబరేలి బడ్జెట్‌గా మాత్రమే ఉందని చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో సౌకర్యాలను గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. తిరుపతి -షిరిడి మధ్య కొత్తరైలు ఏర్పాటు చేయాలని విన్న వించినా పట్టించుకోలేదన్న ఆయన తలపై తెల్ల వస్త్రం కప్పుకుని నిరసన వ్యక్తం చేశారు.