ఉక్కు సంకల్పం పెరగాలి

 

కడప,నవంబర్‌22(జ‌నంసాక్షి): కడపలో ఉక్కు పరిశ్రమ సాధించాలంటే విద్యార్థి ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని సిపిఎం కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. ఇప్పటి విద్యార్థుల భవిష్యత్తు బాగుపడాలంటే ఉక్కు పరిశ్రమ రావాలని, అప్పుడే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కులాలకు, మతాలకు అతీతంగా, రాజకీయ నాయకులు, ప్రజాసంఘాలు, యువత ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని కోరారు. కడప కోటిరెడ్డికూడలిలో రాకపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉక్కు దీక్షలు ప్రభుత్వాన్ని కదిలించలేకపోతున్నాయని అన్నారు. రాయలసీమ జిల్లాల్లోని విశ్వవిద్యాలయాలే కాకుండా రాష్ట్రంలోని అన్ని కళాశాలల విద్యార్థులు ఉక్కు ఉద్యమాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇన్ని రోజులుగా ఉక్కు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వం, ప్రతపక్ష నాయకులు, అధికారులు ఎవరూ కూడా స్పందించకపోవడం దారుణమని అన్నారు. మరోసారి సీమ ప్రజలను వంచనకు గురిచేయాలని చూస్తున్నారని, విద్యార్థులు

మేల్కోవాలని, తిరగబడాలని అన్నారు.