ఉక్రెయిన్‌తో రష్యా హోరాహోరీ పోరు

పలు నగరాలపై బాంబుల వర్షం
3500 మంది సైన్యాన్ని మట్టుబెట్టామన్న ఉక్రెయిన్‌
14 విమానాలు, 8 హెలికాప్టర్లను కూల్చామని ప్రకటన
కీవ్‌ తదితర పట్టణాలను స్వాధీనం చేసుకున్న రష్యా
కీవ్‌,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యాకు కూడా భారీ నష్టమే జరిగింది. ఇప్పటి వరకు సుమారు 3500 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ ఆర్మీ తన ఫేస్‌బుక్‌ పేజీలో అప్‌డేట్‌ చేసింది. మరో 200 మంది రష్యా సైనికుల్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. దీనికి తోడు 14 విమానాలను, 8 హెలికాప్టర్లను, 102 యుద్ధ ట్యాంక్‌లను కూడా రష్యా కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ ఆర్మీ తెలిపింది. అయితే ఈ సమాచారాన్ని ఎవరూ ద్రువీకరించలేదు. ప్రస్తుతం జరుగుతున్న దాడిలో మృతులకు సంబంధించిన వివరాలను ఇప్పటి వరకు రష్యా వెల్లడిరచలేదు. రష్యా సైన్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని ఉక్రెయిన్‌ సైన్యం శనివారం ప్రకటించింది. 14 రష్యా యుద్ధ విమానాలను కూల్చేశామని, 102 యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేశామని తెలిపింది. సుమారు 3,500 మంది రష్యన్‌ దురాక్రమణదారులను మట్టుబెట్టినట్లు పేర్కొంది. ఈ ప్రకటనను ఉక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ధ్రువీకరించింది. రష్యా గురువారం ఉదయం నుంచి ఉక్రెయిన్‌పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్‌ జెలెన్‌స్కీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో, తమ మిత్ర దేశాల నుంచి ఆయుధాలు, ఇతర పరికరాలు రాబోతున్నట్లు తెలిపారు. యుద్ధ వ్యతిరేక కూటమి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అంతకుముందు ఆయన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్‌ మేక్రన్‌తో మాట్లాడారు. ఇదిలావుండగా, ఉక్రెయిన్‌కు 600 మిలియన్‌ డాలర్లు సహాయం అందించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతకం చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో నాటో స్పందన దళాన్ని యాక్టివేట్‌ చేశారు. సైన్యం, వాయు సేన, నావికా దళం దీనిలో ఉన్నాయి. నాటో సుప్రీం అల్లయిడ్‌ కమాండర్‌ జనరల్‌ టోడ్‌ వోల్టర్స్‌ ఈ దళాన్ని యాక్టివేట్‌ చేశారు. అయితే నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం లేదు. కాబట్టి ఈ దళం ఆ దేశానికి వెళ్ళడానికి అవకాశం లేదు. మరోవైపు ఉక్రెయిన్‌ ఆగ్నేయ దిశలోని జపొరిజ్జ్య ప్రాంతంలో ఉన్న మెలిటోపోల్‌ నగరం తమ వశమైందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఐగోర్‌ కొనషెంకోవ్‌ శనివారం చెప్పారు. రష్యన్‌ సాయుధ దళాలు ఈ నగరంపై సంపూర్ణ ఆధిపత్యం సాధించినట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత కోసం తమ సైన్యం అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఉక్రెయిన్‌ జాతీయవాదులు, స్పెషల్‌ సర్వీసెస్‌ ప్రతిఘటనను తిప్పికొట్టేందుకు కూడా చర్యలు తీసుకున్నట్లు
చెప్పారు. ఇకపోతే ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ రష్యా సైనిక చర్యతో విలవిల్లాడుతోంది. ఉక్రెయిన్‌ సైన్యం మాత్రం వీరోచితంగా ప్రతిఘటిస్తుండగా, రష్యా సైనిక బలగాల బాంబు దాడులతో రాజధాని సహా పలు నగరాలు చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. సైనిక స్థావరాలపైనే తాము దాడులు జరుపుతున్నట్టు రష్యా చెబుతున్నప్పటికీ జనావాసాలను సైతం బాంబులు తాకుతున్నాయి. తాజాగా కీవ్‌లోని ఓ బహుళ అంతస్తుల భవనాన్ని రష్యా క్షిపణి తాకడంతో ఆ భవనం పూర్తిగా దెబ్బతింది. ఇందుకు సంబంధించి భవంతిలో నివసించే వారే తీసినట్టుగా చెబుతున్న ఒక వీడియో అక్కడి పరిస్థితిని అద్దంపడుతోంది.