ఉక్రెయిన్‌పై రష్యా యుద్దం
తెల్లవారుజామునే బాంబర్లతో మొదలైన దాడి
ఎదురుదాడికి దిగిన ఉక్రెయిన్
రష్యన్ ఫైటర్ జెట్లను కూల్చేసినట్లు ప్రకటన
యుద్దం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో మార్షల్ లా విధింపు
ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు ప్రజలు
నేడు మరోమారు భద్రతామండలి అత్యవసర భేటీ
మాస్కో,ఫిబ్రవరి24(జనం సాక్షి): ప్రపంచ దేశాలు భయపడినట్లుగగానే.. ఉక్రెయిన్‌పై రష్యా సమరభేరి మోగించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్‌పై మిలటరీ ఆపరేషన్‌కు ఆదేశించారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని పుతిన్ ప్రకటించారు. ఆయన ప్రకటనతో రష్యా బలగాలు దూకుడు పెంచాయి. ఉక్రెయిన్‌పై దూసుకెళ్లేందుకు దాడులకు దిగాయి. గురువారం తెల్లవారుజాము నుంచే ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తోంది. దీంతో ఆ దేశ సరిహద్దుల్లో బాంబుల మోత మోగుతోంది. ముందు నుంచి అలుముకున్న యుద్ధమేఘాలు అమల్లోకి వచ్చాయి. ముందు నుంచి దూకుడు ప్రదర్శించిన రష్యా.. ఉక్రెయిన్‌పై దాడికి దిగింది. రష్యా దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్ కూడా ఎదురుదాడికి దిగింది. దీంతో ఇక ప్రత్యక్ష యుద్దం అనివార్యం అయ్యింది. ప్రపంచ దేశాలన్నీ ప్రతిఘటిస్తున్నా.. యుద్దానికి కాలుదువ్వింది. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఒక కాలు వెనక్కి వేసినట్లు కనిపించినా..ఉక్రెయిన్ ఒక అడుగు ముందుకు వేయడంతో రష్యా రెండడుగులు ముందుకు వేసింది.అర్ధరాత్రి సమయంలో ఉన్నపళంగా దాడికి దిగిన రష్యా.. ఉక్రెయిన్ ఊపిరి పీల్చుకోకుండా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎయిర్ బేస్‌లపై దాడి, ఎయిర్‌పోర్ట్ లపై అటాక్, విద్యుత్ వ్యవస్థపై దాడి.. ఇవన్నీ చూస్తుంటే.. పక్కా ప్రణాళికతో దాడికి దిగినట్లు అర్థం అవుతుంది. కీ జోన్స్‌పై దాడి చేసి.. ఎదురుదాడి చేయకుండా పక్కాగా ప్రణాళిక రచించినట్లు రష్యా తాజా దాడులు స్పష్టం చేస్తున్నాయి. డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లాలని పుతిన్ హెచ్చరించారు. ఎక్కడికక్కడ శిబిరాలు, ఆయుధాలను వదిలేసి వెళ్లిపోవాలని హెచ్చరిక చేశారు. మరోవైపు ఉక్రెయిన్ సయితం మరింత అప్రమత్తమైంది. రష్యా దూకుడుకు ధీటుగా వ్యవహరిస్తోంది. భారీగా రిజర్వు, అదనపు బలగాలను మోహరించింది. ఉక్రెయిన్‌లో నెలరోజుల పాటు ఎమర్జెన్సీ ప్రకటించింది. ముందు జాగ్రత్తగా ఎయిర్ స్పేస్‌ను కూడ మూసివేసింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌లో అత్యవసర పరిస్థితి కొనసాగుతోంది. అలాగే వైద్య శిబిరాలను సయితం ఏర్పాటు చేశారు. ఉన్నపళంగా దాడికి తెగబడ్డ రష్యా.. ఉక్రెయిన్‌ను చుట్టుముట్టింది. మూడు వైపుల నుంచి దాడి చేసి.. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసింది. ఏ వ్యవస్థ పనిచేయాలన్నా.. విద్యుత్ అంత్యంత ముఖ్యం. ఆ వ్యవస్థను దెబ్బతీసేలా రష్యా దాడులకు తెగపడిరది. ఆ తర్వాత దాడులపై ఎదురుదాడి చేయాలంటే ఎయిర్‌పోర్ట్‌లు, ఎయిర్‌బేస్‌లు చాలా కీలకం. ఏకంగా 11 నగరాల్లో.. ఆయా కేంద్రాలను సెర్చ్ చేసి అటాక్ చేసింది. అయితే రష్యా దాడులతో అప్రమత్తమైన ఉక్రెయిన్ ఎదురుదాడి ప్రారంభించింది. రష్యాకు ధీటుగా భారీగా బలగాలను మోహరించి కీలక ప్రాంతాల్లో తిరుగుబాటు మొదలు పెట్టింది. రష్యా ఫైటర్ జెట్‌ను ఉక్రెయిన్ బలగాలు కూల్చివేశాయి. 5 రష్యా విమానాలు, హెలికాప్టర్‌ను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ మేరకు ఐదు రష్యా ఎయిర్‌క్రాప్ట్, జెట్లు, హెలికాప్టర్లను కూల్చేశామని ఉక్రెయిన్ సైన్యం వెల్లడిరచింది. రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ ప్రభుత్వం మార్షల్ లా విధించింది. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని ఉక్రెయిన్
ఆదేశించింది. తమ దేశ భద్రత కోసం సైనికులు పూర్థి స్థాయిలో పోరాడతారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రష్యా బలగాలు ఎయిర్ స్టైక్స్‌త్రో పాటు మిస్సైల్స్‌తో ఉక్రెయిన్‌పై అటాక్ చేస్తున్నాయి. ఎయిర్ డిఫెన్స్ కెపాసిటీని కూల్చేశామని రష్యా తెలిపింది. ఆ దేశ సరిహద్దుల్లో సుమారు 1.50 లక్షల మంది సైనికులు మోహరించారు. మరోవైపు బెలారస్ సైనికులు కూడా రష్యా దళాలతో చేరారు.
ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి మరోసారి అత్యవసరంగా సమావేశమైంది. సైనిక మోహరింపు, తదితర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ సాగింది. యుద్ధ పరిణామాలు ఉక్రెయిన్‌కు వినాశకరమని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు చాలా దూరం అవుతాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నారు. మానవతా దృక్పథంతో యుద్దాన్ని ఆపాలని రష్యాను ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా దాడి నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు దేశాన్ని విడిచి వెళ్తున్నారు. పెద్ద సంఖ్యలో కార్లలో బయలుదేరిన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. ప్రధానంగా రాజధాని కీవ్‌ను విడిచి ప్రజలు పారిపోతున్నారు. ఉక్రెయిన్‌లో ప్రముఖులు, రాజకీయ నాయకులు బంకర్లలో తలదాచుకొని ప్రాణాలు రక్షించుకుంటున్నారు. రష్యా దాడులపై ఉక్రెయిన్ తీవ్రంగా స్పందించింది. రష్యా పూర్తిస్థాయి యుద్దాన్ని ప్రకటించిందని, ఇది దురాక్రమణ చర్యగా అధ్యక్షుడు జెలెన్‌స్కీ వర్ణించారు. శాంతియుత నగరాలపై దాడులకు పాల్పడుతున్నారని, ప్రపంచ దేశాలు పుతిన్‌ను నిలువరించాలన్నారు. యుద్ధం ఆపడం ఐరాస బాధ్యతనని పేర్కొన్నారు. రష్యా దాడుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ముందుగా దౌత్యపరమైన ప్రయత్నాలే చేస్తామన్న జెలెన్ స్కీ.. రెండో ప్రణాళికగా బలగాలను దింపుతామని తెలిపారు. రష్యా మిలిటరీ ఆపరేషన్ నేపథ్యంలో ఉక్రెయిన్ ప్రజలకు అధ్యక్షడు జెలెన్ స్కీ సందేశం అందించారు. రష్యా కేవలం సైనిక స్థావరాలపైనే దాడి చేస్తోందని, సైన్యం తన పని తాను చేసుకుబోతుందన్నారు. ఉక్రెయిన్ ప్రజలు భయాందోళనకు గురికావొద్దని తెలిపారు.
మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడితో అమెరికా ప్రెసిడెంట్ ఫోన్‌లో చర్చలు జరిపారు. రష్యాపై మరిన్ని కఠిన ఆంక్షలు విధిస్తామని జో బైడెన్ తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్‌కు బ్రిటన్,ఫ్రాన్స్ మద్దతు తెలిపాయి. రష్యా` ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శుక్రవారం జీ`7 దేశాలతో జో బైడెన్ అత్యవసర సమావేశం నిర్వహించ నున్నారు. నాటో కూటమికి సహకరిస్తామని తెలిపారు.