ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో భారతీయుల తరలింపు
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో (Ukraine) ఉన్న భారతీయులను వెనక్కి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాయబార కార్యాలయ సిబ్బంది సహా అక్కడ ఉన్న భారతీయులకు స్వదేశానికి తరలించే ప్రక్రియను ప్రారంభించింది. ఉక్రెయిన్-రష్యా మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా మూడు రోజులపాటు ప్రత్యేక విమానాల్లో భారతీయులను ఉక్రెయిన్ నుంచి తరలించనున్నారు.
దీంతో మంగళవారం తెల్లవారుజామున ఎయిర్ ఇండియా తొలి ప్రత్యేక విమానం డ్రిమ్‌లైనర్ బీ-787 ఉక్రెయిన్ బయలుదేరింది. రెండు వందలకుపైగా సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ విమానం ఉక్రెయిన్ నుంచి ఈరోజు రాత్రి 10.30 గంటలకు ఢిల్లీ చేరుకొనున్నది.
తూర్పు ఉక్రెయిన్‌లోని వేర్పాటు ప్రాంతాలైన డొనెట్స్క్, లుహాన్స్క్‌లకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రెండు ప్రాంతాలను స్వతంత్ర రాష్ట్రాలుగా గుర్తిస్తున్నామని చెప్పారు. ఆ రాష్ట్రాలకు మిలటరీ సహకారం అందిస్తామని పుతిన్ ప్రకటించారు. దీంతో ఇరు దేశాల మధ్య పరిస్థులు మరింత క్షణించాయి.
రష్యా చర్యపట్ల అమెరికా సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. రష్యా స్వతంత్ర హోదా ప్రకటించిన రెండు ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు విధించింది. అక్కడ కొత్తగా పెట్టుబడులు పెట్టడం, వ్యాణిజ్యం చేయడాన్ని నిషేధిస్తున్నామని ప్రకటించింది.