ఉగ్రవాదులకు ఇదో గుణపాఠం విదేశాంగ శాఖ మంత్రి ఖుర్షీద్‌

న్యూఢిల్లీ, నవంబర్‌ 21:భారత్‌పై దండెత్తే వారికి కసబ్‌ ఉరితీత ఓ గుణపాఠం లాంటిదని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ హెచ్చరించారు. కసబ్‌ ఉరి తర్వాతైనా ఉగ్రవాదులు తమ తీరు మార్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. 26/11 కేసులో తాము చట్ట ప్రకారమే నడుచుకున్నామని, పాకిస్తాన్‌ కూడా అదే బాటలో సాగుతుందని ఆకాంక్షించారు. నేర శిక్ష్మాస్మృతి అంశంలో భారత్‌, పాక్‌లకు పెద్దగా తేడా లేదని చెప్పారు. బుధవారం ఉదయం ఢిల్లీలో ఖుర్షీద్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కసబ్‌కు ఉరి శిక్ష అమలుపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని అన్నారు. కసబ్‌ ఉరితీతపై ముందుగానే పాకిస్తాన్‌ ప్రభుత్వానికి సమాచారమందించామని చెప్పారు. చట్ట పరిధికి లోబడే కసబ్‌కు ఉరి శిక్ష అమలు చేశామని తెలిపారు. ఎలాంటి వివక్షకు తావివ్వకుండా అన్ని అవకాశాలను పరిగణనలోకి తీసుకున్నామని ఆయన చెప్పారు. దేశంలోని చట్టాలకు లోబడి, న్యాయస్థానం నిర్ణయం మేరకే ఉరిశిక్ష అమలు జరిగిందన్నారు. కసబ్‌ మృతదేహాన్ని అందజేయాలని పాకిస్తాన్‌ నుంచి కానీ, ఆయన కుటుంబ సభ్యుల నుంచి గాని ఎలాంటి విజ్ఞప్తి తమకు అందలేదన్నారు. భారత చట్టాల ప్రకారం కసబ్‌కు అన్ని అవకాశాలు కల్పించామని ఖుర్షీద్‌ వివరించారు. ఉరిశిక్ష పడిన అనంతరం క్షమాభిక్ష కోరేందుకు అవకాశం కల్పించామని.. ఎవరైనా భారత్‌ దృష్టిలో సమానమేనని చెప్పేందుకు ఇదే ఉదాహరణ అని అన్నారు. భారత్‌లో అందరికీ ఒకే న్యాయమని, చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమామేనన్నారు.