ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. కుషీనగర్ జిల్లా (Kushinagar) నెబువా నౌరంజియాలో ప్రమాదవశాత్తు బావిలో 13 మంది మృతిచెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నౌరంజియాలో వివాహ వేడుకలో భాగంగా హల్దీ ఫంక్షన్ జరుగుతున్నది. ఈ సందర్భంగా కొందరు మహిళలు, యువతులు బావి పైకప్పుపై నిల్చున్నారు. అయితే బరువు అధికమవడంతో పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.
దీంతో అంతా బావిలో పడిపోయారు. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందారని పోలీసులు తెలిపారు. మరో 15 మందిని గ్రామస్తులు కాపాడరని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు. క్షతగాత్రులను దవాఖానాకు తరలించామన్నారు.
ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు పరిహారం ప్రకటించారు.