ఉదయం వేళల్లోనూ క్రాకర్స్‌ కాల్చుకోవచ్చు

– బాణాసంచాపై ఆదేశాలు సవరించిన సుప్రీంకోర్టు
– రెండుగంటలు మించకూడదు
– స్పష్టంచేసిన సుప్రింకోర్టు
న్యూఢిల్లీ, అక్టోబర్‌30(జ‌నంసాక్షి) : దీపావళి, ఇతర మతాలకు చెందిన పండుల సందర్భంగా బాణాసంచా కాల్చడంపై ఇటీవల సుప్రింకోర్టు పరిమితులు విధించిన విషయం విధితమే. కాగా సుప్రీంకోర్టు ఇప్పుడు వాటిని సవరించింది. ఇటీవల బాణాసంచా విక్రయాలపై నిషేధం లేదని కానీ, కొన్ని షరతులు విధించింది. ఆన్‌లైన్‌ లో బాణాసంచా విక్రయాలను నిషేధిస్తూ పర్యావరణానికి హాని కలిగించని గ్రీన్‌ క్రాకర్స్‌ ను కాల్చాలని సూచించింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల లోపు బాణాసంచాను కాల్చాలని, న్యూ ఇయర్‌ రోజు, క్రిస్మస్‌ వేడుకల్లో రాత్రి 11.45 నుంచి 12.30లోపు బాణాసంచా కాల్చుకోవాలని జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ఉత్తర్వులను సవరించాలంటూ తమిళనాడు, పుదుచ్చేరిలు సుప్రింకోర్టును ఆశ్రయించాయి.  తమ రాష్ట్రంలో దీపావళిని ఉదయం చేసుకుంటామని, తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఉదయం 6.30 గంటల వరకు టపాకులు కాల్చుకునే అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరాయి. భారత్‌ ఓ సమాఖ్య దేశమని, వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాల సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయని, దీపావళి పండుగ విషయంలోనే ఒక్కొక్క రాష్ట్రం భిన్నంగా జరుపుకుంటుందని అడ్వకేట్‌ వినోద్‌ ఖన్నా తన పిటిషన్‌లో వాదించారు. రావణుడిని సంహరించిన రాముడు ఇంటికి వచ్చిన తర్వాత ఉత్తర భారతీయులు రాత్రి పూట దివాళీ జరుపుకుంటారని, కానీ దక్షిణ భారతీయులు నరకాసుర వధ జరిగిన మరుసటి రోజు ఉదయం దీపావళి జరుపుకుంటారని అడ్వకేట్‌ వినోద్‌ తన పిటిషన్‌లో తెలిపారు. తమిళనాడులో దీపావళి రోజు ఉదయం 4 గంటలకే ప్రజలు నిద్ర లేచి తలంటు స్నానం చేస్తారని, ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకుని, పటాకులు కాలుస్తారని పిటిషన్‌లో తెలిపారు. వారి వాదనలు విన్న సుప్రీంకోర్టు తమిళనాడు, పుదుచ్చేరి వారికి అనుకూలమైన సమయంలో బాణాసంచా కాల్చుకోవచ్చునని సూచించింది. కానీ 2గంటలకు మించకూడదని పేర్కొంది. దీపావళి సందర్భంగా గ్రీన్‌ క్రాకర్లు ఉపయోగించాలన్న గత ఆదేశాలు ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ కోసమేనని ఆ ఆదేశాలు భారత్‌ దేశం మొత్తం వర్తించవని తెలిపింది. గత తీర్పును సవరిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలు  క్రాకర్స్‌ కాల్చే సమయాన్ని మార్చుకోవచ్చని సూచించింది. అయితే అది మాత్రం 2గంటలకు మించి ఉండకూడదని తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి వంటి ప్రదేశాల్లో బాణా సంచా కాల్చుకోవడానికి రెండు రోజులకు మించి సమయం ఉండకూడదని ఆదేశించింది. నవంబర్‌ 6ఉదయం వేడుక జరుపుకోవాలని తమిళనాడు ప్రభుత్వం కోరింది. దీపావళి బాణాసంచాల కాల్చుకోవడానికి అనుమతించిన సమయాన్ని పొడిగించాలని కోరింది. దీనిపై స్పందించిన కోర్టు పై విధంగా తీర్పును సవరించింది.