ఉదయిస్తున్న తరానికి నేను ప్రతినిధిని

– అస్తమిస్తున్న తరానికి చంద్రబాబు, లోకేష్‌, జగన్‌లు ప్రతినిధులు
– జనసేన అంటే చంద్రబాబుకు భయం పట్టుకుంది
– టీడీపీని గౌరవప్రదంగా ఓడిద్దాం
– సంపద అంటే జగన్‌కు వేల కోట్లు.. చంద్రబాబుకు వేల ఎకరాలు
– జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌
కాకినాడ, నవంబర్‌29(జ‌నంసాక్షి) : ఉదయిస్తున్న తరానికి తాను ప్రతినిధిని అని, చంద్రబాబు, లోకేష్‌, జగన్‌ అస్తమిస్తున్న తరానికి ప్రతినిధులు అని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చేనేత కార్మికులతో జరిగిన సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడారు. తనను ఎక్కువగా నమ్మేది యువత, ఆడపడుచులు అన్నారు. ఆడపడుచు కన్నీళ్లు తుడవని అధికారం ఎందుకని ప్రశ్నించారు. న్యాయం చేసేందుకు ముందడుగు వేయని నాయకులెందుకు అని ప్రశ్నించారు. అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న వారికి మనల్ని పాలించే హక్కు ఉందా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు తాను వచ్చానన్నారు. జనసేన అంటే చంద్రబాబుకు భయం అని, అందుకే తెలంగాణలో కూడా జనసేన అని మాట్లాడుతున్నారన్నారు. టీడీపీని గౌరవప్రదంగా ఓడిద్దామన్నారు. యువత, ఆడపడుచులే దేశానికి దిశా నిర్దేశం చేయాలన్నారు. సంపద అంటే జగన్‌కు వేల కోట్లు? చంద్రబాబుకు వేల ఎకరాలు గుర్తుకొస్తాయని, కానీ జనసేనకు సంపద అంటే యువత అన్నారు.
ఫిబ్రవరిలో చేనేత కార్మికుల సదస్సు..
ఫిబ్రవరిలో చేనేత కార్మికుల సదస్సు ఏర్పాటు చేస్తానని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. చేనేత ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌లోకి తీసుకెళ్తే ఫ్యాషన్‌ అయిపోతుందన్నారు. చేనేత రంగంలోని వ్యక్తులు వృత్తికి కాకుండా పార్టీకి అంకితమవుతున్నారన్నారు. చేనేత కార్మికులకు తప్పకుండా గుర్తింపునిస్తానన్నారు. చేనేత కార్మికుల నుంచి సమర్థవంతమైన నాయకులను తీసుకొస్తామని పేర్కొన్నారు.
చేనేత కార్మికులకు తాను అండగా ఉంటానని  పవన్‌ కల్యాణ్‌ అన్నారు. చేనేత గొప్ప కళ అని, చేనేత కార్మికులకు ఆరోగ్య భద్రత ఉండాలన్నారు. కులాల పేర్లు చెప్పి నాయకులు బాగుపడ్డారు కానీ? కులాలు బాగుపడలేదని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రతిపక్ష నాయకుడు రోజు అసెంబ్లీకి వెళ్లి ఉంటే చేనేత కార్మికుల సమస్యలు చెప్పేవారని? కానీ ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వెళ్లరని విమర్శించారు. దొడ్డిదారిన మంత్రి అయిన లోకేష్‌కు చేనేత కార్మికుల సమస్యలు తెలియవన్నారు. చేనేత కార్మికులకు ధైర్యం ఇవ్వడానికే వచ్చానన్నారు. చేనేత కార్మికులకు కేవలం రెండు సీట్లు ఇచ్చినంత మాత్రాన విూ సమస్యలు తీరవన్నారు. చేనేత కార్మికులకు తప్పకుండా గుర్తింపునిస్తానన్నారు. పవర్‌ లూమ్స్‌లో చాలా సమస్యలున్నాయన్నారు.