ఉద్యమంలా హరితహరం
హైదరాబాద్‌లో కదిలిన జనం
నిమ్స్‌లో సీఎం కేసీఆర్, భెల్లో గవర్నర్
ఇది ప్రజలందరి కార్యక్రమం నరసింహన్
హైదరాబాద్,జులై11(జనంసాక్షి): హరితహారంలో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒకేరోజు 25 లక్షల మొక్కలునాటే కార్యక్రమానికి బీజం పడింది. పెద్దెత్తున్న మొక్కలు నాటే కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఓ వైపు గవర్నర్ నరసింహ్, మరోవైపు సిఎం కెసిఆర్, మంత్రులు, సినీనటులు, అధికారులు, సెలబ్రిటీలు ఇలా ఒక్కరేంటి అంతా మొక్కవోని ధైర్యంతో ఈ కర్యాక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌ను హరిత హైదరబాద్‌గా మార్చాలన్న సిఎం కెసిఆర్ పిలుపుతో జంటనగారాల్లో ఉత్సాహంగా కర్యక్రమాన్ని చేపట్టారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రముఖులు, ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు హరితహారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఆయన మొక్కలు నాటారు. హరితహారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.బీహెచ్‌ఈఎల్‌లో హరితహారంలో గవర్నర్ నరసింహన్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ,మహేందర్ రెడ్డిలు పాల్గొన్నా రు. హరితహారం ప్రభుత్వ కార్యక్రమం కాదు.. మనందరి కార్యక్రమం అని గవర్నర్ నరసింహన్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి దానిని సంరక్షించాలన్నారు. వాననీటి సంరక్షణతో పాటు మొక్కలునాటడం తప్పనిరి చేయాలని, అలా చేసి భవన నిర్మిణాలకు అనుమతులు ఇవ్వాలని సూచించారు. ప్రతి అపార్ట్‌మెంట్‌లో కనీసం పది మొక్కలు ఉండేలా చూడాలన్నారు. బీహెచ్‌ఈఎల్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ మొక్కను నాటారు. అనంతరం గవర్నర్ మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ నివాసాలలో, కాలనీల్లో మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలి.. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని సూచించారు. గాలి, నీరు ఉంటేనేమనుగడ సాధ్యమవుతుంది.. పంటలు పండుతాయని తెలిపారు. పది మొక్కలు నాటితేనే కొత్త భవనాల నిర్మాణానికి అనుమతిస్తామని చెప్పాలన్నారు. ఈ ఏడాది కాలం పూల బోకేలను బంద్ చేసి మొక్కలతో స్వాగతం పలకాలని సూచించారు. ఆరు నెలల తర్వాత తానే స్వయంగా మొక్కలను పరిశీలిస్తానని స్పష్టం చేశారు.
మానవచరిత్రలో అతిపెద్ద ప్రయత్నం అన్న కెటిఆర్
హరితహారం ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బీహెచ్‌ఈఎల్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మానవ చరిత్రలోనే ఇది అతిపెద్ద మూడో ప్రయత్నమని తెలిపారు. చైనా, ఆఫ్రికా తర్వాత భారీ స్థాయిలో హరితహారం చేపట్టడం తెలంగాణలోనే అని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 24 శాతం అటవీ విస్తీర్ణాన్ని 33 శాతంకు తీసుకుపోవాలని పిలుపునిచ్చారు. మొక్కలు పెట్టడం కాదు.. వాటిని పరిరక్షించడం కూడా ముఖ్యమన్నారు. భవిష్యత్‌లో మొక్కలు పెడితేనే ఇల్లు, పరిశ్రమలకు అనుమతిస్తామనే ప్రతిపాదన తీసుకువచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో దుష్ఫలితాలు ఏర్పడుతున్నాయి. దుష్ఫలితాలు ఏర్పడకూడదంటే మొక్కలను నాటి పెంచాలని చెప్పారు. హరితహారాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా చూడొద్దని కోరారు. ప్రజలందరూ తమ ఇంటి కార్యంగా భావించి హరితహారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు హరితమైన తెలంగాణను అందించాలన్నారు. తెలంగాణను ఆకుపచ్చగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోనే హరితహారం చేపట్టాలని సీఎం పిలుపునిచ్చారని తెలిపారు. తెలంగాణ జాతి అంటేనే పట్టుదలకు మారు పేరు.. అదే స్ఫూర్తితో హరితహారాన్ని విజయవంతం చేయాలన్నారు. మొక్కలను నాటి.. వాటిని పెంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. పుట్టినప్పుడు పిల్లోడికి చెట్టు కొమ్మకు ఊయల కడుతాం.. చనిపోయినప్పుడు చితికి చెట్టు కట్టెలే వాడుతాం.. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మనషుల జీవితాలు చెట్లతో ముడిపడి ఉంటాయన్నారు. అందుకే చెట్లను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని కోరారు. ఇక రాష్ట్ర వ్యాప్తాంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లోని చెరువులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.. కానీ మెదక్‌లో మాత్రం అటువంటి పరిస్థితి లేదని గుర్తు చేశారు. ఎక్కడైతే అడవులు ఉన్నాయో అక్కడే వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. మెదక్ జిల్లాల్లో అటవీ విస్తీర్ణం 6 నుంచి 7 శాతం మాత్రమే ఉందన్నారు. కనుక మొక్కలను అధిక సంఖ్యలో పెంచి 7 శాతం నుంచి 33 శాతానికి అటవీ విస్తీర్ణాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు. మొక్కల పెంపకం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని కోరారు.
నిమ్స్‌లో మొక్కనాటిన సిఎం కెసిఆర్ వనాలు పెంచుదాం.. వానలు కురిపిద్దాం. మొక్కలు నాటుదాం.. వానలను రప్పిద్దాం.. అనే నినాదంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం శరవేగంగా ముందుకు దూసుకుపోతోంది. కోట్లాది మొక్కలను నాటి తెలంగాణను పచ్చని తీవాచీగా మార్చాలని సీఎం కేసీఆర్ చేస్తోన్న మ¬న్నత ప్రయత్నానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈమేరకు ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూడా హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. నగరంలోని నిమ్స్ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని వేప మొక్క, కదంబ మొక్కను నాటారు. మొక్కలకు నీళ్లు పోశారు. ఈ కార్యక్ర మంలో సీఎంతోపాటు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డితోపాటు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. హరితహారాన్ని కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా భావించొద్దని, అందరూ తమ ఇంటి కార్యక్రమంలా భావించి లక్షల సంఖ్యలో మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణను పచ్చన వనంగా మార్చుదామని పిలుపునిచ్చారు.
హరితహారంలో సినిమా తారలు
కేబీఆర్ పార్క్‌లో నిర్వహించిన హరితహారంలో జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, సినీతారలు రాజేందప్రసాద్, శ్రీకాంత్, తనికెళ్ల భరణి, రాజ్‌తరుణ్, రెజీనా తదితరులు పాల్గొని మొక్కలు నాటారు. అల్లు అర్జున్, దగ్గుబాటి రానా తమ నివాసాల్లో మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనడం విశేషం. నానక్‌రామ్ గూడ వద్ద నటుడు రానా దగ్గుబాటి మొక్క నాటారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నాటిన మొక్కను పరిరక్షించాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. హరితహారంలో అందరూ పాల్గొనాలని కోరారు. నిన్న కేబీఆర్ పార్క్‌లో రాశీ ఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్ మొక్కలు నాటిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు సామాజిక బాధ్యతగా మొక్కలు నాటుతున్నారు. సినీనటులు సైతం మొక్కలు నాటుతూ అభిమానుల్లో ఉత్సాహాన్ని నాటుతున్నారు. సినీనటుడు దగ్గుబాటి రానా నానక్‌రామ్‌గూడలో మొక్కలు నాటారు. మొక్కలు నాటుతున్న ఫోటోలను ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. గచ్చిబౌలిలోని టీసీఎస్ క్యాంపస్‌లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మొక్క నాటారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం కార్యక్రమంగా భావించొద్దని కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని పెంచాలన్నారు. చెట్లు లేకపోవడం వల్ల సకాలంలో వర్షాలు పడటం లేదన్నారు. ఐటీ ఉద్యోగులు హరితహారంలో పాల్గొనడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గాంధీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు టీసీఎస్ ఐటీ ఉద్యోగులు పాల్గొన్నారు. ఫిల్మ్‌నగర్ రౌండ్‌టేబుల్ ప్రభుత్వ పాఠశాలతోపాటు ఖైరతాబాద్‌లో జరిగిన హరితహారం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. హరితహారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ విధిగా పాల్గొనాలని కోరారు. మొక్కలను నాటడంతోపాటు వాటిని సంరక్షించుకోవాలని అన్నారు. రాష్ట్రంలో అడువుల శాతాన్ని పెంచేలా ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతంగా ముందుకు తీసుకుపోదామని పిలుపునిచ్చారు. తెలంగాణకు హరితహారం.. తెలంగాణ బంగారు భవతకు సోపానం అనే నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం విజయవంతంగా ముందుకు సాగిపోతోంది. రాజధాని హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లో మంత్రులు, నాయకులు, అధికారులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వీరితో కలిసి ప్రజలు లక్షల సంఖ్యలో మొక్కలు నాటుతున్నారు. ఈమేరకు ఇవాళ నగరంలో పలుచోట్ల పచ్చని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయారెడ్డితోపాటు పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు.




