‘ఉద్యమంలోకి అన్ని పార్టీలు కలిసి రావాలి’
ఆదిలాబాద్, నవంబర్ 6 : ప్రజల పక్షాన పోరాడని పార్టీలకు మనుగడ ఉండదని ఐకాస నేతలు అన్నారు. రాష్ట్ర సాధనలో భాగంగా ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం నాటికి 1038 రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్ష మేరకు అన్ని సంఘాలు రాష్ట్ర సాధన కోసం ఉద్యమిస్తుంటే టిడిపి, కాంగ్రెస్‌లు మాత్రం తమ రాజకీయ లబ్ధికోసం వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆ పార్టీ నాయకులకు భవిష్యత్‌లో స్థానం ఉండదని వారు అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆలోచనకు అనుగుణంగా నడుచుకొని ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమంలోకి కలిసి రావాలని వారు డిమాండ్ చేశార. రాష్ట్రం సాధించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని అవసరమైతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.