‘ఉద్యమంలోకి రాని వారిని వెలి వేస్తాం’
ఆదిలాబాద్‌్, నవంబర్ 15 : తెలంగాణ ఉద్యమంలో కలిసిరాని పార్టీలను, నాయకులను వెలివేస్తామని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 1047వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐకాస జిల్లా కన్వీనర్ దామోదర్‌తోపాటు మాజీ ఎమ్మెల్యే వామన్‌రెడ్డి, ఇతరనాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను కాపాడాల్సిన పార్టీలు, నాయకులు తమ రాజకీయ లబ్ధికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వద్ద మోకరిల్లుతున్నారని వారు దుయ్యబట్టారు. తెలంగాణ ఉద్యమంలో ఎవరు వచ్చినా రాకపోయినా ఉద్యమం కొనసాగించడంఖాయమని వారు స్పష్టం చేశారు. ఉద్యమంలో నాయకులు కలిసి రాకపోతే తెలంగాణ ప్రాంతంలో వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదన్న విషయం తెలుసుకుని వారు హెచ్చరించారు. కేంద్రం స్పందించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. కాగా ఆదిలాబాద్, ముథోల్ ఎమ్మెల్యేలు జోగురామన్న, వేణుగోపాల చారి దీక్షా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.