ఉద్యమాలతోనే విద్యారంగ సమస్యల పరిష్కారం

* ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జర్పుల ఉపేందర్

జూలూరుపాడు, ఆగష్టు 19, జనంసాక్షి:
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించి, విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నాయని ఎఐఎస్ఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు జర్పుల ఉపేందర్ అన్నారు. శుక్రవారం జూలూరుపాడులో జరిగిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫాం అందలేదని అన్నారు. ప్రభుత్వ విద్యా విధానం మీద ప్రజలకు నమ్మకం పోయిందని, కార్పోరేట్ పాలకులతో విద్యా వ్యవస్థను నడిపిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 26065 ప్రభుత్వ పాఠశాలలో ఉండగా మన ఊరు, మనబడి కార్యక్రమం కింద 9123 పాఠశాలలను మాత్రమే చేర్చి వెయ్యి పాఠశాలలను ఎంపిక చేయలేదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాల విద్యలో 20,519 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా 4వేల కోట్లు స్కాలర్ షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఈ తరుణంలో విద్యారంగంలో వస్తున్న మార్పులను విద్యార్థులకు తెలియపరుస్తూ, విద్యార్థి లోకాన్ని చైతన్యం చే‌సేందుకు ఆగస్టు 26, 27, 28 తేదీల్లో మూడు రోజుల పాటు పోరాటాలకు కేంద్ర బిందువైన కొత్తగూడెం నగరంలో రాష్ట్ర మూడో మహాసభలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభలకు రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి 700 మంది విద్యార్థి సంఘాల ప్రతినిధులు హాజరవుతారని, సమావేశాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు