ఉద్యోగాల భర్తీ చేపట్టండి
కడప కలెక్టరేట్ ముందు ధర్నాలు
కడప,ఆగస్ట్13(జనం సాక్షి ): ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేలాంటూ కడప కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం డివైఎఫ్‌ఐ ధర్నా నిర్వహించింది. డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరనాల శివకుమార్ మాట్లాడుతూ… ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ఈ ధర్నా చేపట్టామన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలేనని చెప్పారు. ప్రతి ఏడాది డిఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరనాల శివకుమార్, నగర కార్యదర్శి అజాయ్‌ద్దీన్, డివైఎఫ్‌ఐ, విద్యార్థులు పాల్గొన్నారు. ఇకపోతే దివ్యాంగులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ ముందు సోమవారం దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. దివ్యాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు మాట్లాడుతూ.. కడప జిల్లాలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను విడుదల చేయాలని కోరారు. దివ్యాంగులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి దివ్యాంగులకు జిల్లాకు మంజూరయిన 250 మోటరైజ్డ్ వెహికల్స్‌ను విడుదల చేయాలని, అంత్యోదయ కార్డు ద్వారా ప్రతి దివ్యాంగులకు 30 కేజీల బియ్యాన్ని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దివ్యాంగులంతా ప్లకార్డులతో కలెక్టరేట్ ముందు బైఠాయించి నినాదాలు చేశారు.